నేను రాజీనామా చేయడం లేదు : మాజీమంత్రి బాలినేని
వైసీపీకి రాజీనామా చేస్తాననే వార్తలను ఇదివరకే ఖండించానని, తాను పార్టీకి గానీ, ఎమ్మెల్యే పదవికి గానీ ఎలాంటి రాజీనామాలు చేయడం లేదని మాజీమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని స్పష్టం చేశారు. కేబినెట్ లో బెర్త్ గల్లంతయ్యాక బాలినేని తీవ్ర అలకబూనారు. దంతో ఆదివారం నుండి ఆయన్ను బుజ్జగించేందుకు వైసీపీ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఎట్టకేలకు తాడేపల్లిలోని సీఎం నివాసానాకి తీసుకొచ్చి జగన్ తో కలిపారు. పెద్ద పదవి ఇస్తామన్న హామీతో బాలినేని రాజీనామా విషయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ తో సమావేశం అనంతంర బాలినేని మాట్లాడుతూ.. రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు వచ్చిన వార్తలను ఖండిచారు.
మంత్రి పదవి కోసం ఎప్పుడూ పాకులాడలేదని, వైఎస్ కుటుంబం, సీఎం జగన్‍కు మేము ఎప్పుడూ విధేయులమేనన్నారు. ఆదిమూలపు సురేష్‍తో తనకు ఎప్పుడూ విభేదాలు లేవని స్పష్టం చేశారు. సీఎం జగన్ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తామని తెలిపారు. వైసీపీకి గతం కంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా కృషి చేస్తామని ఉద్ఘాటించారు. సీఎం జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు.
సామర్థ్యం ఉన్న వారినే సీఎం జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారని తెలిపారు. అందరికీ పదవులు ఒకేసారి రావు అని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 70 శాతం మంత్రి పదవులు ఇచ్చిన పార్టీ ఒక్క వైసీపీనే అని అన్నారు. పార్టీ తమ కుటుంబం.. అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే తన ఉద్దేశం అని తెలిపారు. అందరూ పార్టీకి విధేయులుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ కృషి చేయాలని పేర్కొన్నారు.