కలుషిత ఆహారం తిని పసిపిల్లలు చనిపోతున్నారు : ఆచంట సునీత
కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో కలుషిత ఆహారం తిని అభం, శుభం తెలియని చిన్నారులు చనిపోవడం చాలా బాధ కలిగిస్తోందని టీడీపీ అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత ఆరోపించారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ఆహార కమిషన్ కు ఫిర్యాదు పత్రం అందించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యవస్థంగా తయారైందని, పర్యవేక్షణాలోపం కారణంగా పలు అంగన్వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరిగా అందడంలేదని పేర్కొన్నారు. నాశిరకం, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను అంగన్వాడీ కేంద్రాలకు తరలిస్తున్నారని, సిబ్బంది వాటినే పిల్లలకు వండి పెడుతున్నారని ఆరోపించారు.
రెండు, మూడు నెలలు అంగన్వాడీలకు పూర్తిగా పాలు సరఫరా కాలేదని తెలిపారు. వరుస సంఘటనలు కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. చిత్తూరు జిల్లా కుప్పం పరిధిలోని గుల్లేపల్లె అంగన్ వాడీ కేంద్రంలో కోడిగుడ్డు తిని చిన్నారి మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా పొదలకూరులోని అంగన్ వాడీ కేంద్రంలో కలుషిత ఆహారం తీసుకున్న 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని గుర్తు చేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడం వల్లే అంగన్ వాడీ కేంద్రాల్లో ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని వివరించారు.
కోడిగుడ్ల కాంట్రాక్టర్లు తమ దగ్గర చాలా రోజులు నిల్వ ఉంచిన కోడిగుడ్లను అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక పాల సమాఖ్యకు ఇవ్వాల్సిన రూ. 130 కోట్లు ఇవ్వని కారణంగా గత సంవత్సరంలో పలు మాసాలు అంగన్వాడీల్లోని పిల్లలకు పాలు సరఫరా కాలేదన్నారు. ఇటీవలే రాష్ట్రంలో ఏర్పాటైన ఆహార కమిషన్ కూడా తన పరిధిలో రాష్ట్రంలోని అంగన్వాడీలలోని పరిస్థితులు, ఆహార సరఫరా విధి విధానాలు, వాటి నాణ్యత, రెగ్యులర్ సరఫరా, ఆస్పత్రి పాలు కావడంలాంటి సంఘటనలపై క్షేత్రస్థాయిలో, ఆయా జిల్లా శాఖలతోరాష్ట్ర స్థాయిలో విచారణ జరిపి పరిస్థితులు చక్కదిద్దగలరని కోరారు.