ఆ అధికారం న్యాయస్థానానికి లేదు : ధర్మాన
కోర్టులు న్యాయాన్ని చెప్పగలవు కానీ చట్టాన్ని రూపొందించలేవని జస్టిస్ వర్మ చెప్పారని వైసీపీ ఎమ్మెల్యేల ధర్మాన ప్రసాద రావు తెలిపారు. అసెంబ్లీలో మూడు రాజధానాలపై గురువారం జరిగిన స్వల్ప కాలిక చర్చలో ధర్మాన మాట్లాడారు.. ‘‘రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగితే కోర్టులు జోక్యం మాత్రమే చేసుకోవచ్చని చెప్పారు. ప్రాదేశిక సూత్రాల ఉల్లంఘన జరిగితే కోర్టుల పరిధి జోక్యం వరకేనన్నారు. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉంది. శాసనకర్త పాత్రను కోర్టులు పోషించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. కోర్టులు ప్రభుత్వాన్ని నడపొద్దు, నడపలేవు కూడా, ఇదే విషయాన్ని సుప్రీం చెప్పింది. జ్యుడిషియల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించారాదని చెప్పింది.
అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు చెప్పింది. ఒక వేళ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారు. అంతే కానీ.. శాసన వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. రాజ్యాంగంలోని మూడు వ్యవస్థల పరిధి ఎంత మేరకు అన్నది కోర్టులే చెప్పాలి. ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీం చెప్పింది. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తు పెట్టుకోవాలి.
సమానమైన హక్కులు, అధికారాలు మూడు వ్యవస్థలకు కూడా ఉన్నాయి. న్యాయవ్యవస్థలో స్వీయ నియంత్రణ ఉండాలని గత తీర్పులు ఎన్నో చెప్పాయి. ప్రజల విశాల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చని సుప్రీం చెప్పింది. సహజ న్యాయసూత్రాలకు నష్టం జరగనంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలకు చట్టాలు చేసుకునే హక్కు ఉంటుంది. శాసన వ్యవస్థ అధికారాలను అడ్డుకుంటే ప్రజలకే నష్టం. ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నాయి. అసమానతలను సరిచేయాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఆ దిశగా విధాన నిర్ణయాలు తీసుకుంటే ఎలా తప్పవుతుంది?’’ అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.