ప్రజల ప్రయోజనాల కోసం పొత్తుల గురించి ఆలోచిస్తా : పవన కళ్యాణ్
లోక కల్యాణం కోరే అన్ని మతాల పెద్దలకు కృతజ్ఞతలని, ఆంధ్రా రాజధాని అమరావతిలో సభ జరుగుతోందని, సభకు విచ్చేసిన కొదమసింహాల్లాంటి జనసైనికులకు కృతజ్ఞతలని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. రాజకీయాలపై తన అవగాహనకు నాగబాబు కారణమని, గెలిచినా.. ఓడినా ప్రయాణం మీతోనే అన్న మనోహర్ కు నమస్కారాలని తెలిపారు. జనసేన 9వ ఆవిర్భావ సభను మంగళగిరికి సమీపంలోని ఇప్పటం గ్రామంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ సోమవారం ప్రసంగించారు.
‘‘పార్టీని నడపాలంటే సైద్దాంతిక బలం ఉండాలి. బలమైన సిద్ధాంతాన్ని పట్టుకున్న లక్షల మంది ఉండాలి. వైసీపీ నేతలపై నాకు వ్యక్తిగత ద్వేషాలు ఉండవు. వైసీపీ విధానాలపైనే నా విమర్శలు. వైసీపీ అశుభంతో పాలన ప్రారంభించింది. వైసీపీ కూల్చివేతతో పాలన ప్రారంభించింది. ఏపీ ప్రజలు తమ బానిసలని ప్రతిజ్ఞ చేశారా? ప్రజల నడ్డి విరగ్గొడతామని ప్రతిజ్ఞ చేశారా? ఒక్క ఛాన్స్ ఇస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారా? న్యాయవ్యవస్థను లెక్కచేయబోమని ప్రతిజ్ఞ చేశారా?
ఏపీ రాజధాని అమరావతి ఎక్కడికీ వెళ్లదు. మీ మీద పడిన లాఠీ దెబ్బ నాపై పడినట్లే. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేస్తాం. వైసీపీ మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి గద్దె దించుతాం. వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. అధికారంలోకి రావడమే జనసేన లక్ష్యం.. ఉద్దేశం కూడా. బీజేపీ నాయకులు ఇచ్చే రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నా. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు. ప్రజల ప్రయోజనాల కోసం పొత్తుల గురించి ఆలోచిస్తా’’ అని సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.