బాబాయ్ శవంతో ఓట్లు పొందాడు : నారా లోకేష్
శవ రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. తండ్రి శవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి పీఠంకోసం ప్రయత్నించాడని ఆరోపించారు. అసెంబ్లీలో చర్చల అనంతరం మీడియా పాయింట్లో లోకేష్ సోమవారం విలేకర్లతో మాట్లాడారు. బాబాయ్ మరణం గొడ్డలిపోటు అయితే, గుండెపోటు అన్నారని, అదే శవంతో ఓట్లు పొందారని అన్నారు. బాబాయ్ హత్య పంథాలో సారా మరణాలను కూడా సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు గంటలు పట్టుబట్టినా సమయం వృథా చేశారు తప్ప, జంగారెడ్డిగూడెం ఘటనపై మండలిలో చర్చించడానికి పాలకులు ముందుకురాలేదన్నారు.
ప్రజల సమస్యలకు సంబంధించి అత్యవసర సమస్యలు, ఇబ్బందులు తలెత్తినప్పుడు చర్చకోసం సభలో వాయిదాతీర్మానం ప్రవేశపెడితే దాన్ని తిరస్కరిస్తారా? అని ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం నాటుసారాఘటనలో 25మంది చనిపోతే దానికంటే ప్రభుత్వానికి ఎమర్జెన్సీ అంశం ఏముందిని ప్రశ్నించారు. ‘‘ఘటనపై మండలిలో చర్చిద్దామంటే ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది? 25మంది చనిపోయారు.. వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయి. భార్యాపిల్లలు దిక్కులేనివాళ్లు అయ్యారయ్యారంటుంటే శవరాజకీయాలు అంటూ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. శవరాజకీయాలపై పేటెంట్ ఉంది జగన్ రెడ్డికే.
శవరాజకీయాల ట్రేడ్ మార్క్, వాటికి బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డి. తండ్రిశవాన్ని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి కావడం కోసం సంతకాలు సేకరించింది ఎవరు.? జగన్ రెడ్డి. సొంతబాబాయ్ కి గొడ్డలిపోటువేసి, దాన్నిబూచిగా చూపించి ప్రజలనుంచి ఓట్లు పొందింది జగన్ రెడ్డి. మండలిలో మేం వాయిదాతీర్మానం ఇస్తే, దానిపై వాళ్ల వెర్షన్ వాళ్లుచెప్పుకుంటూ, చదువుతుంటే మేం వినాలంట. మీకంటే, నాకంటే కూడా శవరాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ రెడ్డేనని ప్రజలకు బాగా తెలుసు. జంగారెడ్డిగూడెం ఘటనపై మేం చర్చ జరగాలి అంటున్నాం. ప్రభుత్వం చేసే ఉత్తుత్తి ప్రకటనలు కాదు’’ అని మండిపడ్డారు.