కుట్ర నీదికాదని చెప్పే దమ్ముందా అచ్చెన్నాయుడు.? : దువ్వాడ
శ్రీకాకుళం జిల్లా మందస మండలం పోతంగి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకట్రావు ఆత్మహత్య కుట్ర నీది కాదని చెప్పే ధైర్యముందా అచ్చెన్నాయుడు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు రక్త చరిత్ర ఏమిటో ఒకసారి రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ లు ఒక పథకం ప్రకారం ఒక వివాదానికి తెరతీశారన్నారు. అచ్చెన్నాయుడు సొంత నియోజకవర్గం, సొంత ఊరు నిమ్మాడ సర్పంచ్ ఎన్నికల్లో ఏకపక్షంగా ప్రతి ఎన్నికల్లోనూ గెలిచేందుకు, ఇప్పటివరకు ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులలో నలుగుర్ని చంపిన చరిత్ర ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడులదని ఆరోపించారు.
వెంకట్రావు ఆత్మహత్యకు కారకుడు తాను కాదని, తనను అరెస్టు చేయాలని చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు నేను చేసిన తప్పేంటి…? ఆత్మహత్యకు, నాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. వెంకట్రావు ఎవరో తెలియదన్నారు. నేను ఎప్పుడూ చూడలేదు, పేరు కూడా వినలేదన్నారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక, ప్రజల్లో శాశ్వతంగా భూస్థాపితం అయిన అచ్చెన్నాయుడు అండ్ కో.. గత కొంతకాలంగా తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. నా అంతు చూడాలి, నన్ను తుదముట్టించాలన్నదే వీరి లక్ష్యమని, హత్యా రాజకీయాలు వీరికి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు.
ఆ ఆడియో లీక్ ప్రకారం… వాస్తవాలు విచారిస్తే… అసలు తనను చంపేస్తామని బెదిరింపు కాల్ ద్వారా ఆడియో చేసింది ఎవరు, అతనికి అచ్చెన్నాయుడుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు ఒక పథకం ప్రకారమే.. ఏడాది కాలంగా తనను హత్య చేయాలని ఎదురు చూస్తున్నాడని ఆరోపించారు. తనను చంపాలని అచ్చెన్నాయుడు, వెంకట్రావును పురమాయించాడని, వీరి ప్లాన్ ను అప్పన్నను బెదిరించడం ద్వారా… ప్రీ ప్లాన్డ్ గా ఆడియో రూపంలో బయట పెట్టాడని ఆరోపించారు. ఈ కుట్రలో ఉన్న చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్ ను అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ కోరారు.