ఇక అలాంటి సినిమాలే చేస్తానన్న రానా.. ‘విరాటపర్వం’పై క్లారిటీ ఇదే!
‘బాహూబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుబాటి రానాకి దాని తర్వాత ఆ రేంజ్లో హిట్ అందుకోవడానికి చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు భీమ్లానాయక్ రూపంలో ఆ కొరత తీర్చుకున్నాడు. ఇందులో పవన్‌కు ధీటుగా డానియల్ శేఖర్‌గా అదరగొట్టాడు రానా. కొన్ని సీన్లలో పవన్ కన్నా రానానే హైలెట్ అయ్యాడు.
డ్యాని పాత్ర చూసి నాన్న సురేశ్‌బాబు చాలా సంతృప్తి చెందారని రానా చెప్పుకొచ్చారు. బాహుబలి’ తర్వాత మళ్లీ ఈ సినిమాకే చాలా గొప్పగా చెప్పారని అన్నారు. ‘ఏదో ఒక రోజు పాటలు, ఫైటులు లేకుండా టాకీతోనే సినిమా తీసి హిట్ కొడతా అని మా నాన్నతో చెబుతుంటా. అలాంటి ప్రయత్నం చేస్తా. ఇకపై అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాలు చేస్తాను. సోషల్ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది. అలాంటి చిత్రాలు చేయాలని నాకూ ఇప్పుడే తెలిసింది’ అని రానా అన్నారు. భీమ్లానాయక్’ విజయోత్సాహంలో ఉన్న రానా.. ఇదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు.
కాగా రానా, సాయిపల్లవి కాంబినేషన్లో రూపొందుతోన్న ‘విరాట పర్వం’ చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియమణి, జరీనా వహాబ్, నవీన్ చంద్ర, సాయిచంద్, నందితాదాస్, బెనర్జీ, ఈశ్వరీరావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి వేణు ఊడుగల దర్శకత్వం వహిస్తున్నారు. ‘విరాటపర్వం’ సినిమా ఓటీటీలో విడుదల అవుతుందంటూ ఆమధ్య జోరుగా ప్రచారం సాగింది. తాజాగా రానా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే విరాట పర్వం సినిమా రీ రికార్డింగ్ పూర్తయిందని… త్వరలో సినిమా ప్రివ్యూ చూడబోతున్నానని రానా చెప్పాడు. ఇప్పటికే చాలా సినిమాల విడుదల తేదీలను ప్రకటించిన నేపథ్యంలో ఓ మంచి రిలీజ్ డేట్‌ను వెతుక్కుని ‘విరాటపర్వం’ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని రానా తెలిపారు.