Meals in banana leaves: అరిటాకులో భోజనం చేస్తే ఎన్ని ప్రయోజనలు ఉన్నాయో తెలుసా..!
కాలానుసారంగా ఎన్నో ఆచారాలు, నియమాలు మారిపోయాయి. ఒకప్పుడు అరిటాకులో మాత్రమే తినేవాళ్లం. అరిటాకుపై వేడి వేడి అన్నం, పప్పు, నెయ్యి వేసుకుని తింటే ఆ రుచే వేరు. పూర్వం కేవలం అరిటాకులోనే కాదు మోదుగ, మర్రి, బాదం ఆకులతో కుట్టిన విస్తర్లలో కూడా తినేవారు. అయితే అవన్నీ ఎండబెట్టాక విస్తర్లుగా కుడతారు. కానీ అరిటాకును పచ్చిగా ఉన్నప్పుడే వాడతారు. అందుకే అన్నింటితో పోలిస్తే అరిటాకే మంచిదని చెబుతారు నిపుణులు. భోజనాన్ని అరిటాకులో తినడం ఎన్ని ప్రయోజనలు ఉన్నాయో తెలిస్తే ఇక విడిచిపెట్టరు. అవేంటో మీకోసం…
అరిటాకులో కూడా ఎన్నో పోషకాలు, సుగుణాలు ఉంటాయి. వేడి వేడి అన్నం, కూరలు వడ్డించగానే ఆకులోని పోషకాలు కూడా వీటిలో కలుస్తాయి. అవి రుచిని పెంచడమే కాదు, శరీరానికి ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. అంతేకాదు తినేప్పుడు మానసికంగా చాలా సంతృప్తిగా ఉంటుంది. ఆహారం ఒంటపడుతుంది. దీనివల్ల శరీరం కాంతిమంతంగా మారుతుంది. పూర్వపు రోజుల్లో ఇష్టంలేని వారిని చంపడానికి అన్నంలో విషం కలిపేవారు. అందుకే పడని వారి ఇంటికి భోజనానికి వెళితే అరిటాకులో తినేవారు చాలా మంది. విషం కలిపిన అన్నం అరిటాకు మీద పెట్టగానే నల్లగా మారుతుందని వారి నమ్మకం. అలా ఆహారం మంచిదో కాదో కూడా తెలుసుకునేవారంట.
అరిటాకులో తినేవారికి ఆకలి పెరుగుతుందని కూడా చెబుతారు. పర్యావరణానికి కూడా ఈ ఆకులు చాలా మంచివి. భూమిలో ఇట్టే కలిసిపోయి ఎరువుగా మారిపోతాయి. మరిన్ని మొక్కలు పెరిగేందుకు సహకరిస్తాయి. అరిటాకులో తరచూ భోజనం చేసేవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. వీటిలోని ఔషధ గుణాలు ఆహారం రుచిని, సుగుణాలను మరింత పెంచుతాయి. చైనాలో చేసిన ఒక పరిశోధన పార్కిన్ సన్స్ వ్యాధిగ్రస్తులు అరిటాకులో భోజనం చేస్తే చాలా మేలని తేల్చింది. అలాగే క్యాన్సర్ నివారణ గుణాలు కూడా దీనిలో ఉన్నాయని చెబుతారు.