మెడమీద కత్తిపెట్టినా మేం ఆ పని చేయం… కానీ జగన్ : హరీష్ రావు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి తెలంగాణ మంత్రి హరీశ్ రావు మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పులివ్వడం కోసం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. అయితే తాము మెడ మీద కత్తి పెట్టినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెపుతున్నారని ఉద్ఘాటించారు.
నూతన విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే రాయితీలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని చెప్పారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 40 వేల కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్ డోజర్లు, ట్రాక్టర్లతో తొక్కిస్తామని ఆ పార్టీకి చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటుంటే… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రాజెక్టులు ఇస్తున్నారని, తెలంగాణకు మాత్రమే ఇవ్వడం లేదని మండిపడ్డారు.
అయితే ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లలేదు. దీంతో కేసీఆర్ పైనా బీజీపీ నేతలు విమర్శల దాడి చేశారు. అనంతరం దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని, మతోన్మాద పార్టీల నుండి దేశాన్ని కాపాడటానికి నాయకత్వం వహిస్తాని కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నచందంగా మారుతున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి మరి.