రైతుల ఖాతాల్లో ఇన్ పుట్ సబ్సీడీ జమ : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
రైతుల ఖాతాల్లో నేరుగా నేడు ఇన్ పుట్ సబ్సీడీని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జమచేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి మంగళవారం రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. గతేడాది నవంబర్‌లో భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతన్నల ఖాతాల్లో ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేశారు. వర్షాలు, వరదలతోపాటు నేల కోత, ఇసుక మేటల కారణంగా పంటలు నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు దీనివల్ల లబ్ధి చేకూరనుంది. రూ.542.06 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 1,220 రైతు గ్రూపుల ఖాతాల్లో వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా రూ.29.51 కోట్లను కూడా జమ చేస్తున్నట్లు పేర్కొన్నరు. మొత్తం రూ.571.57 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన ప్రతి రైతుకూ పూర్తి పరిహారాన్ని ప్రభుత్వం సకాలంలో అందజేస్తుందని తెలిపారు. రబీలో విత్తనాలు వేసి.. వర్షాల వల్ల మొలక శాతం దెబ్బతిన్న రైతులకు మళ్లీ విత్తుకోవడానికి వీలుగా 80 శాతం రాయితీతో 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ప్రభుత్వం పంపిణీ చేసిందన్నారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టాలను అంచనా వేసేవారని, వారికి కావాల్సినవారికే పరిహారం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక శాస్త్రీయంగా, అర్హులెవరూ మిగిలిపోకుండా ఈ–క్రాప్ ఆధారంగా పంట నష్టాలను అంచనా వేస్తున్నామని, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శిస్తోందని వివరించారు.