Steve Smith: ‘‘నరకం అంటే ఏంటో చూశాను.. 55 నిమిషాలు చుక్కలు కనపడ్డాయి’’..స్మిత్!

Steve Smith: ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ సిరిస్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఇరు జట్లు కూడా నువ్వా నేనా అన్నట్లు తలబడుతుంటాయి. తాజాగా జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా పై చేయి సాధించింది. ఇప్పటికే 5 టెస్టుల సిరీస్ ను మూడు మ్యాచులు గెలిచి కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్ టీంను చిత్తుచిత్తుగా ఓడించి రెట్టించిన ఉత్సాహంతో మిగిలిన రెండు టెస్టులకు సన్నద్ధం అవుతోంది. యాషెస్ గెలిచిన ఆస్ట్రేలియా సంబరాల్లో మునిగితేలుతోంది. ఆటగాళ్లంతా మెల్ బోర్న్ లోని హోటల్ రూంలో సంబరాలు చేసుకున్నారు.  ఇదిలా ఉంటే మాజీ కెప్టెన్, ప్రస్తుత వైస్ కెప్టెన్ స్మిత్ కు మాత్రం భయంకరమైన అనుభవం ఎదురైంది. అనుకోకుండా స్మిత్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయాడు.

దాదాపు 55 నిమిషాల పాటు లిఫ్ట్ లో గడపాల్సి వచ్చింది. మరో ఆటగాడు మార్నస్ లబుషెన్ స్మిత్ ను బయటకు తీసుకువచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. చివరకు లిఫ్ట్ టెక్నీషియన్ వచ్చి సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాతే లిఫ్ట్ నుంచి బయటపడ్డాడు స్మిత్. ఈ మొత్తం ఉదంతాన్ని ఇన్ స్టా గ్రామ్ లో పంచుకున్నాడు స్టీవ్ స్మిత్.

‘లిఫ్ట్ ఎక్కిన తర్వాత నేను వెళ్లాల్సిన ఫ్లోర్ వచ్చినా.. డోర్స్ ఓపెన్ కాలేదు. దీంతో విషయాన్ని సహచర క్రికెటర్ మార్నస్ లబుషెన్ కు చెప్పాను. ఓ వైపు నుంచి నేను, మరో వైపు నుంచి లబుషెన్ ఎంతగా ప్రయత్నించినా డోర్ ఓపెన్ కాలేదు. మా ప్రయత్నాలు ఫలించకపోవడంతో లిఫ్ట్ ఆపరేటర్ వచ్చి నన్ను కాపాడాడు. ఆ క్షణంలో పోయిన ప్రాణం తిరిగి వచ్చిందనుకున్నా.. 55 నిమిషాల పాటు లిఫ్ట్ లో నరకం అనుభవించా..ఆ తరువాత రూమ్ లోకి వెళ్లి రెస్ట్ తీసుకున్నా..’ అని చెప్పుకొచ్చాడు స్మిత్.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *