సీఎం జగన్ దిగొచ్చేవరకు మా పోరాటం ఆగదు- అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే కొత్తగా తీసుకొచ్చిన ఓటీఎస్ పద్దతిని ప్రతి పక్షాలు వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాయి. ఈ పథకాన్ని ప్రభుత్వం పేద ప్రజలకు సంజీవని వంటిదని అంటే.. టీడీపీ మాత్రం రక్తం పీల్చే పథకం అంటూ వ్యతిరేక నినాదాలు చేపడుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు ఈ పథకానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ.. పలు చోట్ల ధర్నాలు చేస్తున్నారు. కాగా, తాజాగా, టీడీపీ ఎపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దీనిపై స్పందించారు. ఓటీఎస్‌పై టీడీపీ నేతలు, కార్యకర్తలు చేపడుతున్ పోరాటానికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా కిందకు దిగొచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సోమవారం నుంచి టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ఉద్యమంలో.. పలు చోట్ల ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, అధికార పార్టీ నేతలు, పోలీసులను కూడా తట్టుకుని.. ఈ నిరసన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు విజయవంతంగా కొనసాగించారు. ఈ క్రమంలోనే నేతలు, కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడిన అచ్చెన్నాయుడు.. ఈ పోరాటంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా అభినందనలు.
ప్రజాస్వామ్య యుతంగా పోరాడుతున్న మా పార్టీ నేతలపై పోలీసులు పలు చోట్ల అన్యాయంగా ప్రవర్తించారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని జగన్ ఇప్పటికే పాతాల లోకానికి కూరుకుపోయేలా చేశాడు.. ఇప్పుడు ఏకంగా వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు కనిపిస్తోందంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పేదల కోసం తెలుగుదేశం పోరాడుతూనే ఉంటుందని అచ్చెన్నాయుడు బలంగా చెప్పారు.