థియేటర్ కంటే కిరాణా షాప్ బెటర్ అంటున్న హీరో నాని…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రచ్చ వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ సర్కార్ అన్నట్టుగా మారుతోంది. ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35పై కొందరు హైకోర్టుకు వెళ్లగా అక్కడ కొంత ఊరట లభించింది. అయినా ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో అప్పీల్ వెళ్లింది.
ఈ సినిమా టికెట్ల వివాదంపై ఇప్పటి వరకు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది స్పందించారు. ఎవరికి వారు తమదైన తరహాలో రియాక్ట్ అయ్యారు. ఇదే అంశంపై నేచురల్ స్టార్ నాని కూడా స్పందించారు. నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా డిసెంబరు 24న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఆయన.. ఏపీ టికెట్ ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదు. ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించడమే అవుతుంది. థియేటర్ రన్ అవ్వడం వల్ల 10 మందికి ఉపాధి లభిస్తుంది. కానీ, ఈ ధరలను చూస్తుంటే.. టికెట్ కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్‌లో ఎక్కవ లాభాలొస్తున్నాయి అని చెప్పుకొచ్చారు. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని.. ఏపీ ప్రభుత్వం కావాలని వారిని అవమానిస్తుందన్నారు నాని అభిప్రాయపడ్డారు.