హౌసింగ్ లబ్ధిదారులకు న్యాయం జరపాలంటూ ధర్నా చేపట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
February 12, 2017
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శనివారం నాడు వైఎస్సార్ నగర్ లో పర్యటించి స్థానిక సమస్యలను పర్యవేక్షించారు. హౌసింగ్ కార్యాలయం ముందు ఎర్రటి ఎండలో లబ్ధిదారులు పడిగాపులు కాయడం చూసి తీవ్రంగా చలించి కనీసం షామియానాలు కూడా వేయని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో హుటాహుటిన అధికారులు షామియానా నిర్మాణ ఏర్పాటు చేపట్టారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇచ్చిన పట్టాల విషయంలో కూడా మతలబు జరగడంతో, ఒకే ఇంటిని ఇద్దరు ముగ్గురు పేరుతో ఉంచి ప్రజల మధ్య గొడవలు కలిగే పరిస్థితులు ఉండడంతో ఈ తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అధికారులు డ్రామాలు ఆపి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రజలతో కలిసి ధర్నా చేపట్టారు. హౌసింగ్ విభాగంలో ఇళ్ళు ఇప్పిస్తామని కొందరు దళారులు వెలిశారని, ఇళ్ల స్థలాలు, కేటాయింపులు, తాళాల పేరుతో డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తున్నదని, ఇలా ఇబ్బందులు సృష్టించే దళారుల అంతు తెలుస్తానని హెచ్చరించారు.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పై సందిగ్ధం ఉంది:
వైఎస్సార్ నగర్ మెయిన్ రోడ్డులో నిర్మాణం జరుపుకుంటున్న షాపింగ్ కాంప్లెక్స్ చట్ట ప్రకారం సరైందా కాదా అనే విషయం తేలాల్సి ఉన్నదని, చట్టవిరుద్ధం అని తెలిస్తే తక్షణ చర్యలు తీసుకోవాలని, లేదా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపడతామని తెలిపారు.