నెల్లూరులో జూనియర్ కళాశాలలపై విద్యార్ధి సంఘాల ఐక్య కార్యాచరణ

నెల్లూరు లోని విద్యార్ధి సంఘాలన్ని ఏకతాటిపైకి వచ్చాయి. జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న  అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ పిలుపునిచ్చాయి. ఆదివారం సర్వోదయ కళాశాలలో పలు విద్యార్ధి సంఘాల నాయకులు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వైసీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.జయవర్ధన్ మాట్లాడుతూ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ప్రయోగశాలలు పూర్తి స్థాయిలో లేవన్నారు. తుప్పు పట్టిన పరికరాలు దర్శనమిస్తున్నాయన్నారు. ఒక కళాశాల వారు మరో కళాశాలను ప్రయోగశాల గా చూపుతున్న దాఖలాలు కూడా ఉన్నాయన్నారు. ప్రశ్నిస్తున్న విద్యార్ధి సంఘాలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏ ఏటికాయేడు జంబ్లింగ్ లో ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తాం అంటుంటే ఈ ప్రైవేటు కళాశాలలు అడ్డుకుంటున్నాయని తెలిపారు. జంబ్లింగ్ ను ఆపడానికి వారు చూపే మొదటి కారణం ప్రయోగశాలలు లేవని, ఇప్పుడు ప్రయోగశాలల విషయంలో ప్రభుత్వం తనిఖీలు జరిపి కళాశాలలను ప్రక్షాళన చేయాలన్నారు. అలా చేయకుండా జంబ్లింగ్ ను ప్రవేశ పెడితే విద్యార్ధులు నష్టపోతారన్నారు. ఈ సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ముజీర్, ఆంధ్రప్రదేశ్ విద్యార్ధి జేఏసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య సాయి, ఎస్ఎఫ్ఐ సహాయ కార్యదర్శి పి.శ్రీనివాసులు ఏపీ ప్రత్యేక హోదా జేఏసి జిల్లా కన్వీనర్ అంజయ్య, ఎఐఎస్ఎఫ్ నాయకులు నసీర్ మరియు వివిధ విద్యార్ధి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
           

Add a Comment

Your email address will not be published. Required fields are marked *