దేశం రోడ్డున పడిందంట !!
November 15, 2016
500 మరియు 1000 నోట్ల రద్దు నేపథ్యంలో వివిధ టీవీ ఛానెళ్లలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మొదట్లో కేంద్ర ప్రభుత్వ తీరుపై హర్షం వ్యక్తం చేసిన పలువురు రాజకీయ నాయకులు, బడా బాబుల వ్యవహారం ఇప్పుడు బట్టబయలవుతోంది. ప్రజలు ఈ వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన నేపథ్యంలో నల్లధనం కల్గిన అనేక మంది బడా బాబులు, రాజకీయ నాయకులు ఆ డబ్బును ఎలాగోలా మార్చేసుకోవచ్చు అని తలచారు. బంగారు దుకాణాల వైపు పరుగెత్తారు, షాపింగ్ మాల్స్ కి పరుగెత్తారు, పెట్టుబడుల వైపు ఆసక్తి చూపారు. కాని నోట్లను బ్యాంకుల్లో తప్పితే ఎక్కడా తీసుకునేందుకు వీలు లేదని, ఆలా ఎవరైనా వ్యాపారవేత్తలు పెద్ద మొత్తాల్లో పాత డబ్బు తీసుకుంటే తమ లెక్కలతో పాటు కొన్న వారి లెక్కలు కూడా చూపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో నల్ల డబ్బు కల్గిన వారి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. బ్యాంకులో డబ్బు వేస్తే లెక్కలు చూపెట్టాలి. దీంతో సతమతమయిపోతున్నారు బడాబాబులు, పలువురు రాజకీయ నాయకులు. సామాన్య ప్రజానీకం బ్యాంకుల ముందు నోట్ల మార్పిడి కోసం బారులు తీరుతున్నారు. దీంట్లో కొంత ఇబ్బంది ఉండేది నిజమే. కానీ తమ అవసరాలు తీరేందుకు ఒకటి రెండు రోజుల్లో సామాన్యులకు డబ్బు బ్యాంకు నుండి లభిస్తున్నది. 4500 రూపాయలు రోజుకి బ్యాంకుల్లో నుండి పాత నోట్లు మార్పు చేసుకోవచ్చు. అదే డిపాజిట్ చేసుకుంటే 24 వేలు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ సదుపాయాలను సామాన్యులు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఎటొచ్చి ఇప్పుడు దీని వల్ల నొప్పి కలిగింది బడాబాబులు, రాజకీయ నాయకులకే. తమ వద్ద ఉన్న నల్ల డబ్బును ఎలా మార్చాలో తెలియక “సామాన్యులు బ్యాంకుల ముందు నిలబడి కష్టపడుతున్నారు, దేశం రోడ్డున పడింది, అసలు సమాజం ఎక్కడికి పోతోంది, ఈ పరిస్థితులను చూస్తుంటే ప్రజలు ఏమైపోతారో” అంటూ లెక్చర్లు దంచుతున్నారు. నల్లడబ్బు నిండుగా ఉన్న వారు వీరి చర్యలను ప్రోత్సహిస్తున్నారు. వీరు పిచ్చి పట్టినట్టు టీవీ ప్రోగ్రాముల్లో అరుస్తున్నారు. నల్లడబ్బు ఎక్కువైపోయిన కొన్ని మీడియా సంస్థలు కూడా జరగని వాటిని కూడా సృష్టించి దేశ ప్రజలు తెగ ఇబ్బంది పడుతున్నారు, చికెన్ తినలేకపోతున్నారు, సినిమాలు చూడలేకపోతున్నారు అంటూ పిచ్చి పిచ్చి కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఈ వ్యవహారాలను టీవీలలో గమనిస్తున్న సామాన్య ప్రజలు వీరి ఆటలను విశ్లేషించే స్థితిలో లేరని వీరు భావిస్తున్నారేమో మరి.