తెలుగుదేశం నాయకుల జన చైతన్య యాత్ర
November 16, 2016
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే అవేమీ ఈ వైసీపీ నాయకులకు కనబడట్లేదా, పొద్దస్తమానం ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర లు ఆగ్రహం వ్యక్తం చేసారు. నగరంలోని 10వ డివిజన్ లో జరిగిన జనచైతన్య యాత్రలో సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి నోటికి వచ్చినట్లు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. రైతుల రుణమాఫీ పై విమర్శలు గుప్పిస్తున్నారని, ఆయన కళ్ళకు రుణమాఫీ కనపడట్లేదా అని ఎద్దేవా చేశారు. పొదలకూరు మండలంలో ఓ గ్రామానికి వెళ్లి విచారిస్తే రుణమాఫీ పొందిన వారిలో ముందు వరసలో వైసీపీ నేతలే ఉన్నారన్న విషయం గుర్తించాలన్నారు . ప్రజలకు మంచి చేసే పనులు కాకాణి చేయాలని సూచించారు. నల్లధనం అరికట్టడం కోసం ప్రభుత్వం నోట్ల రద్దు పై తీసుకున్న చర్య మంచి ఫలితాలను ఇస్తుందన్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ ప్రజా సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తప్పక పరిష్కరిస్తాం అని తెలిపారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పార్టీ సభ్యత్వ కార్యక్రమం చేపట్టాలని పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నగర ఇన్ ఛార్జ్ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, కావలి ఎఎంసీ ఛైర్మెన్ దేవరాల సుబ్రహ్మణ్యం, టీడీపీ నగర అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ మంత్రి రమేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అనురాధ, గ్రంధాలయ ఛైర్మెన్ కిలారి వెంకటస్వామినాయుడు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.