ఇచ్చట బ్లాక్ మనీని వైట్ గా మార్చబడును
November 12, 2016
మీ దగ్గర బ్లాక్ మనీ ఉందా ఎలా వైట్ చేసుకోవాలో తెలియక తికమకపడుతున్నారా అయితే మీ పాత నోట్లన్నిటినీ వైట్ గా మార్పు చేసి క్రొత్త నోట్లిస్తాం అంటూ మార్కెట్లో పలువురు బ్రోకర్లు వెలిశారు. కొందరు బ్యాంకుల్లో ఖాతాల వివరాలు కనుక్కుని బ్యాలెన్సులు లేని వినియోగదారుల వద్దకు వెళ్లి మీ అకౌంట్ లో 2.5 లక్షలు వేస్తాం డ్రా చేసి ఇచ్చేటపుడు 50 వేలు మీరు తీసుకుని 2 లక్షలు ఇవ్వండి చాలు అంటూ వల వేస్తున్నారు. ఈ రకంగా 10 లక్షలు మారిస్తే 2 లక్షలు బ్యాంకు ఖాతాల వారికి పోగా 1 లక్ష నుండి 2 లక్షల వరకు తమ కమీషన్ గా పట్టుకుని మిగిలిన ఆరేడు లక్షల రూపాయలను నల్లధనం ఇచ్చిన వారికి అందజేసే ఏర్పాట్లు చేస్తున్నారు. కొందరు బ్యాంకుల్లో లోన్ల వివరాలు కనుక్కుని ఆ లోన్లు తీసుకున్న వారి దగ్గరికి వెళ్లి మీ బ్యాంకు లోనును వడ్డీతో పాటు అణా పైసలతో సహా చెల్లించేస్తాం మీరు ఓ ఆరు నెలల తర్వాత నుండి వడ్డీలేమీ లేకుండా అసలు చెల్లిస్తే చాలు అంటూ పూచికత్తు ప్రామిసరీ వ్రాయించుకుని తమ నల్ల డబ్బులు తెల్లగా అయ్యే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది బ్రోకర్లు ప్రతి నగరంలో వెనుకబడిన ప్రాంతాలు, మురికి వాడల వద్దకు వెళ్లి ప్రజల నుండి బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారు. తమ అక్కౌంట్ లు, ఏటీఎం కార్డులు ఇస్తే 50 వేల వరకు ఇస్తామని ఆశ చూపించి బ్యాంకు పాస్ బుక్ లను, ఏటీఎం కార్డులను పట్టుకుపోతున్నారు. దేశీ మార్కెట్లో ఇప్పుడు ఇదో క్రొత్త బిజినెస్ గా మారింది. నోట్లను మార్చుకునే గడువు, బ్యాంకులో డిపాజిట్ చేసుకునే గడువు డిసెంబర్ 30 వరకే ఉండడంతో ఎవరికి తోచిన ఉపాయాలను వారు పన్నుతున్నారు. డిసెంబర్ రెండో వారం గడిచాక ఈ నల్ల ధనం విజృంభణ పెచ్చుమీరే అవకాశాలు అధికంగా ఉన్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. కొన్ని చోట్ల బ్యాంకుల సిబ్బందే అక్రమాలకు పాల్పడుతున్నారు. బ్రోకర్ల ద్వారా 10 లక్షలకు 2 నుండి 3 లక్షల వరకు కమీషన్ తీసుకుని వాటి స్థానంలో 100 నోట్లను ఇస్తున్నారు. కొంతమంది నల్ల ధన పరులు తమ ఆప్తులు, సొంత ఊరు వైపు తరలుతున్నారు. నమ్మకంగా ఉన్న వారి ద్వారా బ్యాంకు ఖాతాలను సేకరించి తమ పని కానిచ్చుకుంటున్నారు. మరోప్రక్క మీ బ్లాక్ మనీని వైట్ గా మారుస్తామని మాకు కమీషన్ ఇస్తే చాలంటూ పలువురు నల్ల ధన పరుల్ని సంప్రదిస్తున్నారు. తీరా వెళ్లి నల్ల ధన వివరాలు ఇచ్చాక ఇన్ కం టాక్స్ డిపార్టుమెంటు అంటూ మొత్తం ధనాన్ని సీజ్ చేస్తున్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ చర్య నల్ల ధన పరులకు తీవ్ర మైన తల నొప్పులు తెచ్చిపెడుతున్నది.