ఆంధ్రప్రదేశ్ లోని ఉన్నత పాఠశాలల్లో ప్రభుత్వ ఉద్యోగాలంటూ నకిలీ వల

మీరు ఎనిమిదో తరగతి గాని, పదో తరగతి గాని చదివుంటే చాలు నెలకు 22 వేల రూపాయల జీతం వచ్చే ప్యూన్ ఉద్యోగం, 29 వేల రూపాయల జీతం వచ్చే క్లెర్క్ ఉద్యోగం మీ సొంతం. ఇంటర్మీడియట్ కానీ పూర్తి చేసుంటే నెలకు 41 వేల రూపాయల జీతం వచ్చే సూపరింటెండెంట్ ఉద్యోగం, డిగ్రీ కాని ఉంటే నెలకు 47500 రూపాయల జీతం వచ్చే హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఉద్యోగాలు మీ స్వంతం. అదీ ఈ ఉద్యోగాలేమీ తక్కువ సంఖ్యలో లేవు. ప్యూన్ ఉద్యోగాలు 20 వేలు, క్లెర్క్ ఉద్యోగాలు 20 వేలు, సూపరింటెండెంట్ ఉద్యోగాలు 20 వేలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్ మెంట్ ఉద్యోగాలు అయితే ఏకంగా 40 వేలు. వెరసి మొత్తం ఒక లక్ష ఉద్యోగాలు. ఒక్కో పోస్టుకి దరఖాస్తు రుసుం ఎంతనుకున్నారు కేవలం 2150 రూపాయలు, సర్వీస్ ఛార్జ్ అదనం. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలిగా మరి.  ఏప్రిల్ 3 న ప్రారంభం అయిన దరఖాస్తుల పర్వం జూన్ 20 వరకు కొనసాగనుంది.
ఇదీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (ఉన్నత పాఠశాల విద్యాశాఖ) పేరుతో వెలసిన నకిలీ వెబ్ సైట్లో లభిస్తున్న ఉద్యోగాల వివరాలు.
అసలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విభాగంలో లేని ఉద్యోగాలను సృష్టించారు. పైగా అన్నీ డిప్యూటీ లైబ్రేరియన్ స్థాయి పోస్టులు అంటూ అర్థం పర్థం లేని నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నారు.
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు ఇలా నకిలీ వెబ్ సైట్ సృష్టించారు. ఉద్యోగాల జాతరకు తెరతీసారు. http://bseap.org.in పేరుతో ఏర్పాటై ఉన్న ఈ నకిలీ వెబ్ సైట్ అచ్చు మన ప్రభుత్వ వెబ్ సైట్ http://bse.ap.gov.in ను పోలి ఉండేలా రూపొందించారు. మన ప్రభుత్వ వెబ్ సైట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లోగో ప్రక్కన Directorate of Government Examinations Popularly known as SSC Board అని ఉంటే ఈ నకిలీ వెబ్ సైట్ లో ఓ ప్రత్యేక లోగోతో Board of Secondary Education Andhra Pradesh అని ఉంది. మిగతా వెబ్ సైట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మానవవనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు ఫోటోలతో సహా అచ్చు గుద్దినట్టు ఒకేలా ఉంది. 
ఈ నకిలీ వెబ్ సైట్ ను ఎవరు నడుపుతున్నారు అనే విషయం, ఇప్పటివరకు ఈ నకిలీ వెబ్ సైట్ లో ఉద్యోగాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకున్నారా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
ఇంటర్నెట్ లో లభిస్తున్న వివరాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో http://bseap.org పేరుతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్య ను నిర్వహిస్తూ ఉండింది. ప్రస్తుతం అది http://bse.ap.gov.in గా రూపాంతరం చెందింది. 
16 ఫిబ్రవరి 2015 న హైదరాబాద్ కు చెందిన ఎబిసి టెక్నాలజీకు చెందిన హందీప్ జూరి అనే పేరుతో, 985984577 ఫోన్ నెంబర్ తో  http://bseap.org.in అను వెబ్ సైట్ రిజిస్టర్ అయి 16 ఫిబ్రవరి 2016 కు రెన్యువల్ కాకుండా ముగిసింది.
తిరిగి తాజాగా 03 ఏప్రిల్ 2017 న గోవా అడ్రెస్ తో Poohriwat mongkonpotjananun అను ఫేక్ పేరుతో, 8300669650 ఫోన్ నెంబర్ తో, pv4568920@gmail.com అనే ఈమెయిల్ తో ఈ నకిలీ వెబ్ సైట్ http://bseap.org.in రిజిస్టర్ అయి ఉన్నది. ఫోన్ నంబర్ ఆధారంగా ఈ నకిలీ వెబ్ సైట్ తమిళనాడు నుండి నడుస్తున్నట్లు తెలుస్తున్నది. Godaddy వెబ్ సైట్ల సంస్థకు చెందిన సింగపూర్ సర్వర్ 182.50.151.83 కు వెబ్ సైట్ లింకై ఉన్నది.
ఇక్కడున్న ఈ దుండగుల ఈమెయిల్ pv4568920@gmail.com ను పరిశీలిస్తే kanpuruni.com పేరుతో 22 మార్చి 2017 న Godaddy నందు మరో వెబ్ సైట్ ను సృష్టించి ఉన్నారు. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ మైంటైనన్స్ అని చూపిస్తున్నా కాన్పూర్ యూనివర్సిటీ కి సంబంధించి కూడా ఈ దుండగుల ముఠా మరో నకిలీ వెబ్ సైట్ సృష్టించే పనిలో ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రజలు ఇలాంటి నకిలీ వెబ్ సైట్ ల గురించి తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి. మన రాష్ట్ర ప్రజలకు నిత్యం అవసరమైన పదవ తరగతి బోర్డు వెబ్ సైట్ కు నకిలీ ని రూపొందించిన ఈ ముఠాను కనుగొని ఇలాంటి నకిలీ ఉద్యోగ ప్రకటనలను అరికట్టాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పై ఉన్నది.
 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *