సూటిగా మాట్లాడిన జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 లో ఎమ్మెల్యే గా పోటీ చేయనున్నట్లు స్పష్టం

అనంతపురంలో సీమాంధ్ర హక్కుల చైతన్య సభ పేరిట బహిరంగ సభ నిర్వహించిన జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ వ్యవహారంపై ఎలా స్పందిస్తారని నూతన నోట్ల వ్యవహారంపై ఏమి మాట్లాడుతారని ఆశించిన వారికి పవన్ కళ్యాణ్ అటువంటి విధానాలపై మాట్లాడకుండా తాను సభ పెట్టిన ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రజలకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా చట్టబద్ధత లేని ప్యాకేజీ ఒకటిచ్చి కేంద్రం చేతులు దులుపుకుందని రాష్టంలోని తెలుగుదేశం ప్రభుత్వం దీనిని ఎలా స్వాగతిస్తుందని అన్నారు. ఏమీ చేయకుండానే హోదా హీరోగా వెంకయ్యనాయుడు సన్మానాలు చేయించుకుంటున్నారని ఇది చాలా సిగ్గు చేటని దుయ్యబట్టారు. సుజనా చౌదరి హోదాని, ప్యాకేజీని విమానంతో పోల్చారని గాల్లో ఎగిరే విమానం అయితే ఫర్వాలేదని కానీ ఇక్కడ పేపర్ తో తయారు చేసి ఆడుకోమని విమానాన్ని ఇచ్చారని ఆయన తీరుని విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఏదో మంచి చేస్తుందని భావిస్తే పూర్తి అవినీతివంతంగా తయారైందని విమర్శలు వస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు కేవలం ఏదో ఒక కులం వారికి, ఒక వర్గం వారికి కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ మేలు చేయాలని కోరారు. తనకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కాని, ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తో కాని ఎటువంటి వ్యక్తిగత శతృత్వం లేదని కేవలం వారు అవలంభిస్తున్న విధానాలతోనే తన పోరాటమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే తానే వారికి ప్రధాన శత్రువుని అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ తొలి కార్యాలయాన్ని అనంతపురంలో వచ్చే ఏడాది ప్రారంభిస్తామని తెలిపారు. 2019 ఎన్నికలలో ఎమ్మెల్యే గా పోటీ చేస్తానని గెలిచినా గెలవకపోయినా రైతుల కోసం, మహిళల భద్రత కోసం, అవినీతి నిర్మూలనకు నిరంతరం పోరాటం జరుపుతూ ఉంటానని స్పష్టం చేసారు. తనకు అధికారం ముఖ్యం కాదని ప్రజా సంక్షేమమే ముఖ్యమని ఈ సందర్భంగా తెలిపారు. అనంతపురం జిల్లాకు ప్రస్తుతం అందుతున్న 40 టిఎంసీల నీటి స్థానంలో 100 టీఎంసీల నీరు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించాలని అన్ని పార్టీలు ఈ విషయమై మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతపురం దేశం లోనే అత్యంత కరువుపీడిత ప్రాంతమని ఈ ప్రాంత అభివృద్ధి కొరకు త్వరలో ఢిల్లీ కి రైలు లో ఇక్కడి ప్రజానీకాన్ని తీసుకెళ్లి కేంద్రం ఎదుట సమస్యలు ఉంచి పరిష్కారం దిశగా పోరాడుతానని జనసేనాని స్పష్టం చేసారు.  

Add a Comment

Your email address will not be published. Required fields are marked *