సచిన్ రాక సందర్భంగా అందంగా ముస్తాబైన పుట్టంరాజు కండ్రిగ పాఠశాల పరిసరాలు

తాను దత్తత తీసుకున్న గ్రామానికి సచిన్ టెండూల్కర్ రానున్న నేపథ్యంలో పుట్టంరాజు కండ్రిగ గ్రామంపై జిల్లా  అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. సచిన్ షెడ్యూల్ లో పీఆర్ కండ్రిగ ప్రభుత్వ పాఠశాల సందర్శన ఉండడంతో ఆ పాఠశాల పరిసరాలను ఆహ్లాదకరంగా మార్చే ఏర్పాట్లు చేసారు. ఇందులో భాగంగా పాఠశాల క్రీడా మైదానం గోడలపై  విద్యార్థులకు క్రీడా స్ఫూర్తిని కల్గించే చిత్రాల రూపకల్పన చేయాలని తలచారు. నెల్లూరు నగరంలో స్వచ్ఛ నెల్లూరు లో భాగంగా వివిధ ప్రహరీ గోడల రూపురేఖలు మార్చిన నేస్తం ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ వారు కలెక్టర్ ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశానుసారం వారి సహకారాలతో పుట్టంరాజు కండ్రిగ పాఠశాల ప్రహరీ చిత్రాలను పర్యవేక్షించి రూపొందించారు. కళాకారుడు ముళ్లమూడి మురళీకృష్ణ అద్భుతమైన చిత్రాలకు రూపకల్పన చేసారు. మూడు రోజుల్లో చిత్రాలను రేయింబవళ్ళు పనిచేసి పూర్తిచేశారు. నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు కోరెం ప్రవీణ్ కుమార్ చిత్ర నిర్మాణాల దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. భారత క్రికెట్ దిగ్గజం భారతరత్న సచిన్ రమేష్ టెండూల్కర్, భారత హాకీ దిగ్గజం పద్మభూషణ్ ధ్యాన్ చంద్, భారత క్రికెట్ సంచలనం పద్మశ్రీ మహేంద్ర సింగ్ ధోని, భారత టెన్నిస్ సంచలనం పద్మభూషణ్  సానియా మీర్జా, భారత బాడ్మింటన్ ధృవతార పద్మభూషణ్ సైనా నెహ్వాల్, భారత బాడ్మింటన్ సంచలనం పూసర్ల వెంకట సింధు చిత్రాలను రూపొందించారు. ఈ చిత్రాలు చూపరులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *