భవిష్యత్తులో మీ జేబులోని డబ్బు కంటే మీ కార్డులోని డబ్బులే శక్తివంతంగా మారనున్నాయి

నగదు రహితం (క్యాష్ లెస్), గత కొద్ది రోజులుగా విస్తృతంగా వినిపిస్తున్న పదం ఇది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నూతన కరెన్సీ ప్రజలకు అందుబాటులోకి పూర్తిస్థాయిలోకి వచ్చేందుకు పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్యాంకుల్లో క్యాష్ నిలబడట్లేదు. ఏటీఎంలలో క్యూలో నిల్చుంటే చేతికి ఓ 500 లో, 2000 లో ఎప్పటికి అందుతుందో తెలియని పరిస్థితి. తీరా ఓ నోటు అందితే దానికి చిల్లర దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు చుట్టుముట్టేస్తుండడంతో ప్రజలకు ఊరట నిచ్చేలా ఏర్పాటవుతున్నవే క్యాష్ లెస్ పాయింట్లు. ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ ఇప్పటికే అన్ని శాఖలకు క్యాష్ లెస్ కు స్వైపింగ్ మెషీన్ లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. ఇప్పటికే రవాణా కార్యాలయంలో ఈ ఏర్పాట్లు చేసారు. రేషన్ షాపుల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వానికి కట్టాల్సిన వివిధ పన్నులు, బిల్లులు కూడా ఇక మీదట డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారానే జమ చేసుకోనున్నారు. 
క్షేత్ర స్థాయిలో పరిస్థితులు గమనిస్తే 
  • ఆర్టీసీ కూడా బస్టాండ్ లలో, రిజర్వేషన్ కౌంటర్ లలో స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసింది
  • పెట్రోల్ బ్యాంకుల్లో ఎప్పటినుండో క్యాష్ లెస్ లావాదేవీలు జరుగుతున్నాయి 
  • రేషన్ షాపులు, మీ సేవా కేంద్రాల్లో కూడా స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు కానున్నాయి
  • అన్ని హాస్పిటల్స్ లో కూడా స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు అవుతున్నాయి 
  • సినిమా హాళ్లలో కూడా స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసి ఉన్నారు
  • ప్రభుత్వం నుండి అందే పింఛను కూడా ఇక మీదట బ్యాంకుల్లోనే జమ కానుంది 
  • నగరంలోని అనేక హోటల్స్ లో ఇప్పటికే స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసి ఉన్నారు, దాబాల్లో కూడా ఏర్పాటు చేస్తుండడం విశేషం 
  • కూరగాయల మార్కెట్ లో కూడా పలువురు వ్యాపారాలు స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు
  • బ్యాంకులు కూడా మైక్రో ఏటీయంల పేరుతో నగదు లావాదేవీలు జరిగే పలు ప్రదేశాల్లో స్వైపింగ్ మెషీన్లు ఉంచుతున్నాయి 
  • నెల్లూరు నగరంలో అనేక వ్యాపారస్తులు ఇప్పటికే బ్యాంకులకు స్వైపింగ్ మెషీన్లు కావాలని దరఖాస్తులు పెట్టుకుని ఉన్నారు, ఇలా ఇప్పటికి 15000 దరఖాస్తులు ఉన్నట్లు సమాచారం
కార్డు స్వైపింగ్ ల పై ప్రభుత్వం చార్జీలు ఎత్తేసింది. పైగా అన్ని బ్యాంకులకు స్వైపింగ్ మెషీన్లు కరెంటు అకౌంట్ ఉన్న వారందరికీ ఉచితంగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంకులు కూడా తమ లావాదేవీల పెరుగుదల కోసం పోటీపడి స్వైపింగ్ మెషీన్లను వ్యాపారస్తులకు ఏర్పాటు చేస్తున్నాయి. భవిష్యత్తులో బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేయాలంటే ప్రతి ట్రాన్సాక్షన్ కు ఛార్జీ వసూలు చేయనుంది. దీంతో కార్డుల ద్వారా క్యాష్ లెస్ కే వ్యాపారస్తులు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎటువంటి ఛార్జీలు లేని కారణంగా 5 రూపాయలు, 10 రూపాయలు కూడా స్వైపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రతి వ్యాపారస్తుడు స్వైపింగ్ మెషీన్ కలిగి ఉండాలి, వినియోగదారుడు నగదు చెల్లిస్తే తప్పించి కార్డు ఇస్తే ఖచ్చితంగా స్వైపింగ్ చేయాల్సిందే అనే నిబంధనను అమల్లోకి తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఇలా కార్డు స్వైపింగ్ లా ద్వారా లావాదేవీలు జరపడం మూలాన బ్యాంకింగ్ లో పారదర్శకత పెరగటంతో పాటు జనానికి చిల్లర సమస్యలు తప్పుతాయి.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *