పుస్తక పరిచయం: దర్గామిట్ట కతలు

“దర్గామిట్ట కతలు” — ఈ పుస్తకం బావుంటుంది.. చదవమని చాలా మంది చెప్పారు.. అయినా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చా.. చివరికి మొన్నా మధ్య పుస్తకోత్సవం (బెంగళూరు) లో కూడా పెద్ద పట్టించుకోలేదు.. కొన్ని పుస్తకాలు తీసుకుని, కౌంటర్ దాకా వెళ్ళిన తరువాత హంపీ నుండి హరప్పా దాకా గుర్తుకు వచ్చింది.. మళ్ళీ వెనక్కి వచ్చా..  అది దొరకలేదు కానీ, ఈ పుస్తకం కనిపించింది.. తీసుకుందామా, వద్దా అని కాసేపు ఊగిసలాడి సరే ఎలా ఉంటుందో చూద్దామని తీసుకున్నా..

పుస్తకం పేరు చూసి, హైదరాబాద్ లో ఏ పాత బస్తీ కి సంబంధించిన కధో అనుకున్నా.. దర్గా మిట్ట నెల్లూరులో ఉంది అని తెలుసు కానీ, ఈ రెంటిని అన్వయించుకోలేకపోయా.. ఇది వ్రాసింది ముస్లిం, అదీనూ పాత బస్తీ కి సంబంధించినది కాబట్టి హిందువులతో పడ్డ గొడవలూ, అవీ-ఇవీ ఉంటాయేమో అనుకుంటూ పుస్తకం తెరిచా (ముందు మాట చదివే వరకూ ఇదే అభిప్రాయం!)..

కతల వెనక కత చదివేసరికి అప్పటివరకూ ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది.. వెనక కధే ఇలాగుంటే ఇక ముందున్న కధలు ఎలా ఉన్నాయో అనుకుంటూ, గబగబా పేజీలు తిప్పా..

***********************

సేమ్యా పాయసం, సేమ్యా ఉప్మా అంటూ తినడమే తప్ప సేమ్యాలు ఎలా వస్తాయో, వాటి తయారీ విధానం ఎలానో తెలుసా.. అసలు వాటిని చేత్తో కూడా తయారు చేయచ్చు అనే సంగతి తెలుసా..?! అయితే అర్జెంటుగా “సేమ్యాల ముగ్గు” చదవాల్సిందే…

కొరియాలో ఉన్నప్పుడు మా గెస్ట్ హౌస్ లో వారానికి రెండు సార్లు చేపల వంటాకాలు ఉండేవి.. మా స్నేహితులు బావుంది, బావుంది అంటూ లొట్టలు వేసుకుని తినే వాళ్ళు.. ఒకసారి అడిగా, అవి ఏ రకం చేపలు అని? దానికి మాకేం తెలుసు.. తినడం మాత్రం మహ బాగా తెలుసు అని చక్కా పోయారు! చేపల్లో సముద్రం చేపలు, మంచినీటి చేపలు మళ్ళీ వాటిల్లో ఎన్నో ఉపరకాలు.. అవన్నీ ఏంటా అని కుతూహలంగా ఉందా.. అయితే “చీదరలు – వంజరాలు” చూడండి మరి.. మాకు ఆల్రెడీ అన్ని రకాలు తెలుసంటారా.. అయినా కూడా చదవాల్సిందే.. మరి డబుల్ చెక్ చేసుకోవాలి కదా!!

ఇంట్లోని పిల్లలందరిలో పెద్దవాళ్ళకి ఉండే గౌరవమూ అదీ, చిన్నవాళ్ళకి ఉండే గారాబమూ ఇదీ, మధ్యలో వాళ్ళకి ఉండదు.. మరి ఆ పెద్దోళ్ళలో చిన్నోడు – చిన్నోళ్ళలో పెద్దోడు ఎన్ని నకరాలు చేశాడో తెలియాలంటే ఆలస్యం చేయకుండా “నేను నేలలో – మా అమ్మ బెంచీలో” కి పేజీలు త్రిప్పండి..

అన్నీ చిలిపి, తుంటరి పనులేనా ఇంకేలేవా అంటే.. మనసు మూగవోయే “మా అన్నే గానీ చదివుంటే”, “బాగారంగడిలో నౌకరి” కూడా ఉన్నాయి… “నమ్మకం పోతే పనోడు బతికిన ఒకటే, సచ్చినా ఒకటేరా అని ఒక్క మాటలో జీవిత సత్యాన్ని చెప్పే కధలు కూడా ఉన్నాయి..

అయినా అది త్రికోణమితి, ఇది జ్యామితి అంటూ వర్గీకరించడానికి ఇవేమీ లెక్కలు కావు.. జీవితం.. లెక్కల్లో పట్టబధ్రుడైన ఒక వ్యక్తి జీవన గమనం.. మనసు పొరల్లో హత్తుకు పోయిన ఘటనలు.. కళ్ళ ముందు జరిగిన నిలువెత్తు సంఘటనలు..

ఈదేసిన గోదారి, దాటేసిన కష్టాలు తీయగా ఉంటాయంటారు ముళ్ళపూడి వారు.. మరి అలాంటి మహానుభావుడితో ముందుమాట వ్రాయించి మరీ మన ముందుకు ఈ కధలు తీసుకు వచ్చారు ఖదీర్ బాబు గారు.. ఇంతకీ మీకు ‘ఖ’ ఎలా పలకాలో తెలుసా.. అయితే “మీసాల సుబ్బరాజు” కధ చదవాల్సిందే..  🙂

****************************
దర్గామిట్ట కతలు 
(Dargamitta Kathalu – Khadeer babu)
-మహమ్మద్ ఖదీర్ బాబు
Ph: 9705444243
కావలి ప్రచురణలు
వెల – 60/-
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పై సమీక్ష రాసినవారు: మేధ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పుస్తక పరిచయం

దర్గామిట్ట కతలు పుస్తక రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు. ఇయన ఆంధ్రజ్యోతిలో పనిచేసాడు. మొత్తం 25 కతలున్నాయి ఈ పుస్తకంలో. ఇవన్ని 1998లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో 25 వారాలపాటు సిరియల్ గా ప్రచురింపబడినవి. ఈకతల సంకలనాన్నీ ‘దర్గామిట్ట కతలు’ పేరుమీద మేనెల 1999లో కావలి ప్రచురణలు ద్వారా పాఠకుల ముందుంచాడు. తిరిగి మలిముద్రణ ఫిబ్రవరి 2002లో జరిగింది. ఈ కథలన్ని నెల్లూరు యాసలో, ఉర్దూపదాలను మమేకంచేస్తూ రాసినారు. ఈ కథలన్ని ఒక ముస్లిం కుటుంబ నేపథ్యం నుండి చుట్టుపక్కలవారితో కలిసిమెలసి అల్లుకుపోయి పుట్టిన కథలు. ఉర్దూపదాలకలయికతో నెల్లూరుయాసలో రాసిన ఈకతలు పాఠకున్ని నవ్విస్తాయి, గిలిగింతలు పెడతాయి. యాంత్రిక జీవనంలోపడి మరచిపోయిన చిన్ననాటి రోజులను కట్టెదట నిలుపుతాయి. ఈ కతల పుట్తిల్లు కావలిలోని ‘కసాబ్ గల్లి ‘ మరియు ‘పాతూరులోని పోలేరమ్మబండ ‘. ఈపుస్తకాన్ని తనతండ్రి కి.శే.ఎం.డి. కరీం గారి కంకితమిచ్చాడు. ఈ కతలను చదివి మురిసిపోయున ముళ్ళపూడి వెంకటరమణ ఖదీర్ ను వెతుక్కుంటూ ఆంధ్రజ్యోతి ఆఫిసుకెళ్లి ‘ముబారక్ ‘అంటూ తన ప్రశంసపత్రాన్ని ఇచ్చారు.

దర్గామిట్ట కతలెనకాల కత

నామిని సుబ్రమణ్యం నాయుడు చిత్తూరు జిల్లాకు చెందిన రచయిత. ఆయన చిత్తూరు యాసలో ప్రజలు మాట్లాడుకొనే భాషలో ‘పచ్చనాకు సాక్షిగా’. సిన్నబ్బ కతలు ‘.’మునికన్నడి సేద్యం ‘తదితర కథలురాసి వాసికెక్కిన రచయిత. మొదట్లో ఆంధ్రజ్యోతి వీక్లీ, తిరుపతిలో ఇన్‍చార్జిగా వుండేవాడు. అక్కడినుండి ఆయన హైదారాబాద్ కు బదిలి అయ్యినప్పుడు, అందులో పనిచేస్తున్న ఖదీర్‍బాబుకు ఆయనతో చెలిమి కుదిరింది. నామినిగారు తన గదికొచ్చినప్పుడు, ఖదీరు తాను రాసిన రెండు కథలను ఆయన ముందుంచాడు. ఆయన అవి చదివి, ఖదీర్‍బాబుతో “..ప్రెతొక్కడూ వాళ్లమ్మ గురించి, వాళ్ళ నాయిన గురించి, చిన్నప్పుడు గురించి రాయాలబ్బా. అట్టా రాస్తేనే మనకు తెలియని జీవితాలు బయలు పడతాయి. ఆ జీవితాల్లోని బ్యూటి తెలుస్తుందన్నాడు.” ఆ మాటలను ప్రేరణగా, చాలెంజ్ గా తీసుకొని రాసినవే ఈ దర్గామిట్ట కతలు. ఆ విధంగా నామిని గారు ఖదీర్‍బాబు కలంనుండి దర్గామిట్ట కతలు రావటానికి మూలహేతువైనాడు.

పుస్తకంలోని కతల సోది

ఈపుస్తకంలో ఇరవైఐదు కథలున్నాయి.అవి వరుస క్రమంలో.

1. నాపేరు పెట్టింది మీసాల సుబ్బరాజు.
2. ఆలిఫ్‍భేతే మా నాయినమ్మకి గోరి కడితే.
3. మా యిస్కూలు యానివసరీకి దుమ్ము రేపేసినా.
4. పాపాలన్నీ మాయమ్మకేనంటా.
5. కసాబ్‍గల్లీలో సేమ్యాల ముగ్గు.
6. బులుగంటే బులుగా పలావెంకరెడ్డా.
7. పండుకపూట పలావుముక్కల కత.
8. మా అన్నేగాని చదివుంటే.
9. చీదలు వంజరాలుమాగలు కండసుదుములు.
10. నేనునేలలో మాఅమ్మబెంచిలో.
11. ఇది మా నాయినిచ్చిన అస్తి.
12. ననుతాకేసిందిరా ‘కాలా జాన్వర్ ‘.
13. నేరేళ్ళ మస్తాన్ సురేషే నాదేవుడు.
14. నా కోరికలు అట్టా తీర్చినాడు.
15. పోలేరమ్మ బండకాడ మా యిల్లు.
16. మా యమ్మ పూలయాపారం.
17. మా జరినాంటీ స్పెసలు సెలవలకత.
18. ముక్కాలులోనేవుంది మజా అనే సున్తీకత.
19. పల్లెటూరి షాదీలో జజ్జనక.
20. దర్గామిట్టలో రొట్టెలపండుగ తీరు.
21. బంగారంగడిలో మన అసిస్టెంటు నౌకరీ.
22. కూటికి పేదైనా కులానికి నవాబునా.
23. తలకాయకూరతో బలే తలకాయనెప్పయినా.
24. చోంగాబుట్టీ షక్కర్ షర్బత్.
25. మా నాయిన ‘ట్రిక్కు’ నేర్వని కత. 

దర్గామిట్ట కతల్లోవున్నోలెవరంటే

ఈకతల నాయకుడు ఖదీరు వోళ్ల నాయిన ‘ట్రిక్కు’లెరుగని కరెంట్ కరీంసాబ్, వోళ్లమ్మ సర్తాజ్ (యింటిపక్కొల్లకు సత్తారమ్మా, నాయినమ్మ, జరీనాంటి, జైబూన్ ఆఫా, నజీరత్త, పూలరిహానా, మాబ్బాష. ఇంతేనా?.ఎందుకులేరు..ఇస్కూల్లో హెడ్ మిసెస్సు రమాదేవి, మీసాలసుబ్బారాజయిలోరు, మాల్యాద్రయివోరు, ఇక సావాసగాళ్లయితే షమ్మీ, సతీష్‍సింగ్, నేరేళ్ళమాస్తాన్ సురేష్, మురళి.సురేష్ గాడయితే ఖాదీరుకు దేవుడే.కరీంగారి గురువు పెండంరవి, సవాసగాడు పలావెంకటరెడ్డి…వీళ్ళాంతా !మరచిపోయే మనుసులేమబ్బా?!.

ముళ్ళపూడి వారి ముబారక్

“అచ్చుతప్పులూ అవకతవకలూ అయోమయాలూ సందేశాలూ సమస్యల పరిష్కారాలూ వున్న కథల గురించి రాయడం బలే జిల్లయిన పని.మనక్లవర్లూ చమత్కారాలూ మిరియాలూ గుప్పించి పేట్రేగిపోవచ్చు, ‘వర్ధమాన ‘రచయిత తల నిమిరి వెన్నుతట్టి ఎంకరేజి చేసి షయినయిపోవచ్చు. కాని-ఆ’వర్థమానుడు’అయిదడుగులు కాకుండా జైన విగ్రహంలా అరవై అడుగుల ఎత్తున నిశ్చలంగా చిరునవ్వుతో నిలబడివుంటే వాడి వెన్ను తట్టడంఎలా? ఇకరాసేదేముంది. చేసేదేముంది. చేతులుజోడించి నమస్కరించడం తప్పు. వేదంలా ప్రవహించే తెలుగు జీవనదిలో ముస్లిం జీవన స్రవంతి ఇంతకాలం అంతర్వాహినిగా-కనపడకుండా ప్రవహిస్తూవుండాలి. ఖదీర్‍బాబు-దర్గామిట్ట కతలతో భగీరథుడిలా ఆ నదిని మనముందు మళ్లించాడు. ఈనదినీటిలో ప్రతిబిందువు ఒక ఆణిముత్యం.మంచుని ఎగజిమ్మే అగ్నిపర్వతం. ఇందులో నాన్నలూ అమ్మలూ అవ్వలూ తాతలూ అందరూ భూలోక దేవతలు.సుఖసంతోషాలలాగే కష్టాలనూ కన్నీళ్లనూ కూడా నగలుగా వేసుకొని హుషారుగా తిరుగుతారు.పాలూ పూలూ పాపాలూ తాపాలూ అన్నీ ఒకటే. ఘోషాలో వున్నట్లుగా ఇన్నాళ్ళూ మనకి కనుపించని ఈ మనోహర జీవన చైతన్యాన్ని ఈనాడు ఆవిష్కరించిన వైతాళికుడు మహమ్మద్‍ ఖదీర్‍బాబుకు నా అభినందనలు -ముళ్ళపూడి వెంకటరమణ.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *