నిజాయితీ వైపు న్యాయంగా నిలబడ్డ యువతి ఈమె

పై ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు హిమని జైన్. ఉండేది ముంబయిలో. ఓ సాధారణ దేశ పౌరురాలు. కానీ ఇటీవల ఈమె గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. యువతీ యువకులు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో హిమని గురించి మాట్లాడుకుంటూ ఆమెను ఎంతగానో అభినందిస్తున్నారు. ఇంతలా ఆమె ఏమి చేసిందనేగా. ఆమె జీవితంలో ఒకరోజు జరిగిన సంఘటన గురించి, ఆ సంఘటనలో తానెలా వ్యవహరించింది తెలియజేస్తూ తన ఫేస్ బుక్ ప్రొఫైల్ పై ఓ పోస్ట్ పెట్టింది. అంతే ఆమె చర్యను, ధైర్యాన్ని మెచ్చుకుంటూ అనేకమంది ఆ పోస్టును షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందో ఆమె మాటల్లోనే…. 
నవంబర్ 24 హిమని జైన్ ఇంగ్లీష్ లో పెట్టిన ఫేస్ బుక్ పోస్టు 123Nellore అనువాదం చేయబడింది. 
“నిన్న నా విషయంలో ఓ సంఘటన జరిగింది. 
నేను ఉబెర్ పూల్ (షేర్ బేసిస్ కార్) తీసుకున్నాను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లేందుకు. ఆ క్యాబ్ డ్రైవర్ షాహీద్ (పేరు మార్చబడింది) మర్యాదస్తుడు, చాలా మంచిగా ప్రవర్తిస్తున్నాడు. ముప్ఫయిలల్లో వయసుండే గాయత్రి (పేరు మార్చబడింది) అనే వేరే ఆవిడతో క్యాబ్ ను షేర్ చేసుకుంటున్నాను. ఆమె క్యాబ్ లోకి ఎక్కిన నిమిషంలోనే షాహీద్ తో ఆమె డ్రాప్ గురించి వాదించడం మొదలెట్టింది. అతను ఆమెకు చాలా మర్యాదగా తనకు మొబైల్ యాప్ ఎలా చూపుతుందో అలానే డ్రైవ్ చేయగలను, నేను రూట్ ని మార్చలేను, ఎంచుకోలేను అని తెలిపాడు. 
గాయత్రి అప్పుడతనితో చాలా అమర్యాదగా మాట్లాడడం ప్రారంభించింది.  “నేనేమైనా ఉబెర్ కి కొత్త అనుకుంటున్నావా అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తూ అతన్ని బండ బూతులు తిడుతూ నీ అంతు చూస్తా అంటూ బెదిరించడం మొదలెట్టింది.” నేను మధ్యలో కలుగజేసుకుని మీకు అతనికి మధ్య ఏదో మిస్ కమ్యూనికేషన్ జరిగినట్లుంది, నేను అతనికి వివరిస్తాను అని అన్నాను. దీంతో గాయత్రి పద వీడి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేద్దాం అనింది. నేను అంగీకరించకపోవడంతో నన్ను కూడా బూతులు తిట్టడం మొదలెట్టింది. ఇంతలో షాహీద్ క్యాబ్ ను ఆపేసి నాకు కల్గిన అసౌకర్యానికి నన్ను క్షమించమని కోరి వేరే క్యాబ్ ద్వారా వెళ్లాల్సిందిగా సూచించారు. ఇంతలో ఈ డ్రామా అంతా జరుగుతుండగా 20 మంది వరకు అక్కడ గుమిగూడారు. వాళ్ళలో ఇద్దరు సెక్యూరిటీ లేడీస్ కూడా ఉన్నారు. నేను ఒక సెక్యూరిటీ లేడీ దగ్గర షాహీద్ ను పోలీసులు ఏమైనా ఇబ్బంది పెడ్తే నాకు ఫోన్ చేయండని నా ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చాను. ఇంతలో గాయత్రి, షాహీద్ ఇద్దరూ 100 కి ఫోన్ చేయగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నేను పోలీసులకు పరిస్థితి వివరించి, షాహీద్ ది ఏమీ తప్పులేదని చెప్పి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చెప్తాను అని నా ఫోన్ నెంబర్ ని వాళ్ళకి ఇచ్చాను. నేను బయలుదేరేలోపు సెక్యూరిటీ లేడీ నా వద్దకు వచ్చి “మేడం, మీరు దయచేసి పోలీస్ స్టేషన్ కు వెళ్ళండి. లేదంటే వాళ్ళు అతన్ని తీవ్రంగా కొడుతారు. మహిళలకు సంబంధించిన విషయం కనుక ఎవ్వరు చెప్పినా వినరు.” అని తెల్పింది. అప్పటికే రాత్రి 9 గంటల సమయం అవుతుంది, ఆ సమయంలో పోలీస్ స్టేషన్ (మొదటిసారి) వెళ్ళడం నాకు భయంగా అనిపిస్తుంది కానీ అతన్ని అలాంటి పరిస్థితిలో వదలదలచుకోలేదు. అందుకే వాళ్లతో సహా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాను. ఇక్కడో విషయం ఏమిటంటే గాయత్రి పోలీసులకు ఈ విషయం వివరిస్తుండగా కానిస్టేబుల్ కలుగజేసుకుని “మేడం, ఇక్కడ అసలు ఏమి ప్రాబ్లెం ఉంది.” అని అన్నాడు. అంతే ఇంతలో గాయత్రి షాహీద్ గురించి తప్పుగా చెప్పడం ప్రారంభించింది. అతను తనతో అసభ్యంగా ప్రవర్తించినట్లు, తనని బూతులు తిట్టినట్లు, కారులో నుండి బయటకు నేట్టేసినట్లు చెప్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పేర్కొంది.
నేను నా స్టేట్ మెంట్ ను పోలీసులకు ఇచ్చాను. నాకు గాయత్రితో కాని షాహీద్ తో కాని ఎటువంటి సంబంధంలేదని, ఇక్కడకు రావాల్సిన అవసరం కూడా లేదని తెలిపాను. నేను ఇక్కడకు ఒక నిరపరాధికి ఏమీ కాకూడదు అనే ఉద్దేశంతోనే వచ్చాను అని తెలిపాను. గాయత్రి  రాత్రి 11 గంటలైనా స్టేషన్ నుండి వెళ్ళలేదు. అతను వచ్చి తన కాళ్ళు పట్టుకుని క్షమించమని కోరితే కానీ వెళ్లనని పోలీసుల దగ్గర పట్టుబట్టింది. తనకు ఈ సంఘటన ఒక గుణపాఠం కావాలంది. కానీ పోలీసులకు నేను చెప్పిన విషయం అర్థమైంది. వాళ్ళు ఆమెకు మేము ఈ విషయం పై చాలా సీరియస్ గా తీసుకుంటాం, మీరు ఇంక బయల్దేరండి అని తెలిపారు. అలా అంటూ షాహీద్ ను ఓ రూమ్ లోకి తీసుకెళ్ళారు. ఆ రూములో నుండి అతన్ని పెద్దగా కొడుతున్నట్లు, అతను బాధతో అరుస్తున్నట్లు తెలుస్తుంది. నేను ఆ రూమ్ లో కానిష్టేబుల్ దగ్గరకు వెళ్లి అక్కడి పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయాను. అక్కడ వాళ్ళు నేలను తంతున్నారు, షాహీద్ అరుస్తున్నాడు. ఇది తప్పో ఒప్పో తెలియదు, కానీ నాకు సంతోషమేసింది. పోలీస్ నా దగ్గరకు వచ్చి నాకు ధన్యవాదాలు తెలిపారు. నేను కాని డ్రైవర్ వెంట నిలబడకుండా ఉంటే అతనికి తీవ్ర నష్టం జరిగేదని తెలిపారు. ఓ గంట తర్వాత షాహీద్ క్యాబ్ లోనే ఇంటికి చేరాను.
పరిస్థితిని అర్థం చేసుకున్నందుకు ముంబయి పోలీసులకు ధన్యవాదాలు.” 
ఇదండీ హిమని జైన్ తన ఫేస్ బుక్ లో ఉంచిన పోస్టు. తప్పు లేకపోయినా కొంతమంది విషయంలో నిర్భయ చట్టం ఎలా దుర్వినియోగమవుతుందో ఈ సంఘటన తెలియజేస్తుంది. అక్కడ హిమని అతని తరపున నిలబడకుంటే నిర్భయ చట్టం ప్రకారం అతను ఈ పాటికి జైల్లో ఊచలు లెక్కబెట్టుకుంటూ ఉండేవాడు. ఓ నిర్దోషి వైపు న్యాయంగా నిలబడ్డ హిమని జైన్ ని దేశవ్యాప్తంగా పలువురు అభినందిస్తున్నారు. 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *