నల్ల ధనం టూ తెల్ల ధనం వయా నెల్లూరు

నెల్లూరు నగరం బ్లాక్ మనీ మార్పిడి మాఫియా కేంద్రంగా మారిందా అంటే అవుననే అంటున్నాయి నిఘా వర్గాలు. పాత 500 మరియు 1000 నోట్లను బ్యాంకులలో వేసుకునే దానికి డిసెంబర్ 30 చివరి తేదీ ముంచుకు వస్తుండటంతో నల్ల ధనం కల్గిన అనేక మంది దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నారు. లెక్కలు చూపలేక, భారీ జరిమానాలు కట్టలేక మింగలేక కక్కలేని పరిస్థితిగా మారింది పలువురిది. ఈ నేపథ్యంలో బ్లాక్ మనీని వైట్ గా మారుస్తామని పుట్టుకొచ్చారు అనేక మంది బ్రోకర్లు. ఇప్పుడు నగరంలో ఏ టీ కొట్టు దగ్గర నలుగురు వ్యక్తులు కలిసినా ఇదే చర్చలు. మీ దగ్గర బ్లాక్ మనీ ఉంటే చెప్పండి వైట్ చేస్తామని. దీనికి 10% నుండి 30% వరకు కమీషన్లు నడుపుతున్నారు బ్రోకర్లు. ఇది ఇలా కొనసాగుతుండగా చెన్నై, బెంగళూరు వంటి నగరాల నుండి సైతం బ్లాక్ బాబులు తమ డబ్బును వైట్ గా మార్చుకునేందుకు నెల్లూరుని కేంద్రంగా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో అంతా గమనిస్తున్న నిఘా వర్గాలు, పోలీసు యంత్రాంగం ఈ వ్యవహారం పై దృష్టి పెట్టి ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. పలు చోట్ల బ్లాక్ మనీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఓ సారి 10 లక్షలు, మరో సారి 26.5 లక్షల నల్ల ధనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ప్రధాన చెక్ పోస్టులు, టోల్ గేట్ల వద్ద తనిఖీలు ముమ్మరం చేసారు. కమీషన్ ల పేరుతో దందాకు పాల్పడేవారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం స్వాధీనపరచుకున్న నగదును పోలీసులు ఆదాయపు పన్ను శాఖ వారికి అందజేశారు. పట్టుకున్న నోట్లలో క్రొత్త నోట్లు ఏ బ్యాంకు ద్వారా జారీ కాబడ్డాయో తెలుసుకుని నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా పోలీసులు. ఈ క్రమంలో ఈ నల్ల ధన మార్పిడిలో బ్యాంకు అధికారుల పాత్ర ఏమైనా ఉంటే వారినీ ఉపేక్షించే అవకాశం లేదని తెలియజేస్తున్నారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *