తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ వాకాటి సస్పెన్షన్

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ప్రకటించారు.
బ్యాంకులు మరియు ఇతర ప్రభుత్వ ఆర్థిక సంస్థల వద్ద నుండి వాకాటి నారాయణ రెడ్డి తన ఆస్తుల విలువను తప్పుడుగా చూపిస్తూ 430 కోట్ల మేరకు రుణాలు తీసుకుని ఎగవేసిన నేపథ్యంలో ఆయన పై సీబీఐ విచారణ కొనసాగుతున్నది. ఇటీవల సీబీఐ బృందం వాకాటి ఆస్తుల పై సోదాలు నిర్వహించి సీజ్ చేసింది. వాకాటిని ఈ కేసుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. 
ఈ సందర్భంలో మంత్రి నారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి వాకాటిని దూరం పెట్టారు. సస్పెన్షన్ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్రతో నెల్లూరు లోనే చర్చించినట్లు తెలుస్తున్నది. అనంతరం అమరావతి వెళ్ళిన ముఖ్యమంత్రి పార్టీ నుండి వాకాటిని సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. పార్టీ లో ఎవ్వరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని, క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *