ఈ సర్వేలు రాజకీయ వ్యూహాల్లో భాగం అంటున్న పవన్ కళ్యాణ్
December 1, 2016
జనసేనాని పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనుందని ఇప్పటికే స్పష్టం చేసారు. అందులో భాగంగా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే తమ పార్టీ మొదటి కార్యాలయాన్ని అనంతపురం వంటి కరువు పీడిత ప్రాంతంలో పెడుతానని తెలిపారు. పాదయాత్ర చేసే దిశగా కూడా తన ఆలోచనలు ఉన్నాయని స్పష్టం చేసారు. ఈ నేపథ్యంలో తెలుగులో విశేషాదరణ ఉన్న ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం ఎవరిది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయనే సర్వేను తెరపైకి తెచ్చింది. స్వతహాగా తెలుగుదేశం పార్టీ పత్రిక అని ముద్ర ఉన్న ఆ పత్రిక నిర్వహించే అనేక పోల్స్ లో ఆ పార్టీ కె మెజారిటీ అభిప్రాయాలు అనుకూలంగా వస్తుంటాయి. ఈ క్రమంలో వచ్చిన సర్వేలో కూడా అధికార పార్టీకి పూర్తి ప్రజా మద్దతు ఉన్నట్లు, బీజేపీ తో పొత్తుగా కాకుండా ఒంటరిగా పోటీ చేస్తే ఇంకా ఎక్కువ సీట్లొస్తాయని తేల్చిచెప్పింది. ఆసక్తికర విషయం ఏమిటంటే జనసేన పార్టీకి అసలు ప్రజా మద్దతే లేదని కేవలం 3.5 శాతం ఓట్లు మాత్రమే జనసేనకు వచ్చే అవకాశం ఉందని ఆ సర్వే స్పష్టం చేసింది. దీనిపై పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ‘కాటమరాయుడు’ సినిమా షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ తన దగ్గరి వాళ్ళతో దీనిపై చర్చించినట్టు సమాచారం. వారి ప్రకారం ఈ వార్తలు చూసిన పవన్ కళ్యాణ్ నవ్వుకున్నారట. రాజకీయ ఉద్ధండులు అయిన చంద్రబాబునాయుడు వ్యూహం లో భాగం ఈ సర్వే అని ఆయన వ్యాఖ్యానించినట్టు సమాచారం. ప్రత్యర్థుల్ని మానసికంగా దెబ్బతీసేందుకు, ఆత్మస్థర్యం కోల్పోయేలా చేయడం కోసం ఇలాంటి ట్రిక్కులు ప్లే చేస్తుంటారని, కానీ ఇవి చాలా పాత ట్రిక్కులని, ఈ సర్వేల నిజస్వరూపం ఏంటో అందరికీ తెలుసని, సాధారణ ప్రజలు కూడా వీటిని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారని పవన్ కళ్యాణ్ అన్నట్లు సమాచారం. కనుక ఈ సర్వేల వల్ల జడవాల్సిన పనిలేదని భవిష్యత్తులో ఇంకా ఘోరంగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారని, దేన్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినట్టు సమాచారం.