అట్టహాసంగా జన్మభూమి కార్యక్రమ ముగింపు, సంక్రాంతి సంబరాలు

జిల్లా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో జన్మభూమి – మా ఊరు ముగింపు వేడుకలు, సంక్రాంతి సంబరాలు వీఆర్సీ మైదానంలో ఘనంగా జరిగాయి. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామంత్రి పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సంబరాల్లో ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, టిడిపి నగర ఇన్ ఛార్జ్ ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, నాయకులు అనం రంగమయూర్ రెడ్డి, తాళ్ళపాక అనురాధ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు పదిరోజుల పాటు జరిగిన జన్మభూమిలో ప్రగతిని వివరించారు. ఇప్పటికే 85 శాతం మేర వచ్చిన దరఖాస్తులను అప్ లోడ్ చేయడం జరిగిందని, మిగిలిన 15 శాతం మరో రెండు మూడు రోజుల్లో పూర్తవుతాయని తెలిపారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి పేద వాడి కళ్ళలో ఆనందం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని, ప్రజల సగటు ఆదాయం ప్రక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువుగా ఉన్నదని ప్రతి ఒక్కరి సగటు ఆదాయం నెలకు 10 వేల రూపాయలు చేయాలన్న సంకల్పంతో ఉన్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నాణ్యమైన గృహాలు నిర్మించాలని తలపెట్టామని, మొదటివిడత టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేసామని ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి స్థాయిలో గృహాల నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. వచ్చే జనవరి 1 నాటికి కొన్ని గృహాలలో గృహ ప్రవేశం జరుగుతుందని ఉద్ఘాటించారు.
గంగిరెద్దుల విన్యాసం, ముత్యాల ముగ్గులు, సాంప్రదాయ నృత్యాలు, కీలు గుర్రాలు, డప్పు వాయిద్యాలు, హరి దాసులు, కోలాటాలతో పండగ వాతావరణంతో వీఆర్సీ మైదానం కలకలలాడింది.
సభలో ప్రసంగాలు జరుగుతున్న సమయంలో మేయర్ అబ్దుల్ అజీజ్ అధిక సమయం మాట్లాడుతున్నారని త్వరగా ముగించాలని మంత్రి ఓ చిన్న కాగితంపై నోటిసు పంపగా మేయర్ ఆ కాగితాన్ని మడిచి పడేయగా, ఇదే తరహాలో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి ఆ నోటీసును జేబులో పెట్టుకున్నారు. ఇదంతా వీక్షిస్తున్న వారిలో నవ్వులు విరిసాయి. కార్యక్రమం అనుకున్న సమయం కంటే అధిక సమయం జరిగింది.
జన్మభూమి విజయవంతానికి దోహదం చేసిన వివిధ అధికారులకు, సంక్రాంతి సంబరాల్లో వివిధ పోటీల విజేతలకు, కళాకారులకు, ఫౌండేషన్ కోర్సును విజయవంతంగా నిర్వహిస్తున్న టీచర్లకు ఈ సందర్భంగా పురస్కారాలు, సర్టిఫికేట్లను మంత్రి చేతుల మీదుగా అధికారులు అందజేసారు.

Add a Comment

Your email address will not be published. Required fields are marked *