పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
January 10, 2017
తనకు పేద ప్రజల అభివృద్దే ప్రధానంగా ముఖ్యమని, అందులో భాగమే పలు సంక్షేమ పథకాలు, జన్మభూమి కార్యక్రమం తదితరాలని జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 2 నుండి 11 వరకు జరుగుతున్న జన్మభూమి కార్యక్రమంలో భాగంగా మంగళవారం గూడూరు నియోజకవర్గం చెన్నూరు గ్రామంలో జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
చెన్నైనుండి హెలికాప్టర్ లో వచ్చిన ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ, పలువురు నేతలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో పలువురికి ముఖ్యమంత్రి డ్వాక్రా రుణాలను అందించారు. సభలో ముఖ్యమంత్రి జన్మభూమి ప్రతిజ్ఞ చేయించి ప్రసంగిస్తూ పేద ప్రజల కష్టాలు తనకు స్వయంగా తెలుసునని అందుకే వారి శ్రేయస్సు దృష్ట్యా పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా క్రింద ఫించన్ లను 5 రెట్లు పెంచామన్నారు. ప్రతి నెల సుమారు 450 కోట్ల రూపాయల నిధులను పేదలకు ఫించన్ల రూపంలో అందిస్తున్న రాష్ట్రం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ గ్యాస్ కనెక్షన్లు అందించే ఏర్పాట్లు చేశామన్నారు. 149 రూపాయలకే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ అందించే ప్రణాళికలు రూపొందించామని జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుకి ఆ సేవలు ప్రారంభించాలని సూచించారు.
ఇదే సందర్భంలో చెన్నూరు గ్రామం పై పలు వరాలను ముఖ్యమంత్రి కురిపించారు. గ్రామంలో ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని కలెక్టర్ ను ఆదేశించారు. టిటిడి ద్వారా కళ్యాణ మండపం నిర్మించనున్నట్లు తెలిపారు. మినీ స్టేడియం, షాదీ మంజిల్ ఏర్పాటు ప్రతిపాదనల్ని కూడా పరిశీలిస్తునట్లు తెలిపారు. గ్రామం మొత్తం సిమెంట్ రోడ్లు వేయాలని, నగదు రహిత గ్రామంగా మారే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ను ఆదేశించారు.
సాగు నీటికి కష్టాలు లేకుండా అనేక చర్యలు తీసుకుంటున్నాం అని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాలో ఒక్క ఎకరా కూడా ఎండనివ్వనని తెలిపారు. సోమశిల, కండలేరు నుండి లేదా అవసరమైతే ఎత్తిపోతల ద్వారా అయినా గూడూరు నియోజకవర్గానికి సాగునీరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. చెన్నూరు గ్రామ సాగు నీరు కోసం 25 లక్షలు విరాళాన్ని టిటిడి ఛైర్మెన్ చదలవాడ కృష్ణమూర్తి ఈ సందర్భంగా ప్రకటించారు.
జన్మభూమి కార్యక్రమంలో పలు సందర్భాల్లో ప్రజలతో ఎక్కువుగా మమేకం అయ్యేందుకు ముఖ్యమంత్రి ఆసక్తి చూపారు. పలువురిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆకట్టుకొనే ప్రయత్నం చేశారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో చెన్నై బయలుదేరారు. మొత్తమ్మీద ముఖ్యమంత్రి పర్యటన విజయవంతంగా సాగడంతో అధికారులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.