నెల్లూరులో ‘ధృవ’ టికెట్ల వివాదం – పోలీసుల వద్దకు పంచాయితీ
December 8, 2016
ప్రముఖ సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి అభిమానుల మధ్య వివాదాలు నెల్లూరు నగరంలో రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి. చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోల సినిమాల విడుదల సందర్భంలో ఈ వివాదాలు తీవ్రతరం అవుతున్నాయి. సాధారణంగా నెల్లూరు నగరం మెగా అభిమానుల అడ్డా. ఇక్కడ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్నది. దీంతో వారి చిత్రాలకు సంబంధించిన మొదటి రోజు టికెట్లను థియేటర్ ల నుండి అభిమాన సంఘాల వారు తీసుకుని అభిమానులకు పంపకాలు చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో ఈ పంపకాల విషయంలో తేడాలు వస్తున్నాయి. కారణం అభిమాన సంఘాల్లో మెలిగిన వారి మధ్య ఏర్పడిన విభేదాలే. కొన్ని విభేదాలు రాజకీయంగా ఏర్పడగా, మరికొన్ని చిరంజీవి యువత అభిమాన సంఘం లో కొంతమంది అభిమానులు ఇమడలేక ఏర్పడుతున్నాయి. చిరంజీవి కుటుంబంలో చిరంజీవి కాంగ్రెస్ పార్టీ, నాగబాబు బీజేపీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలకు చెంది రాజకీయంగా వేరువేరు పార్టీలలో మెలుగుతూ ఉండగా, ఇక్కడ చిరంజీవి యువత అభిమాన సంఘం వారు మాత్రం కాంగ్రెస్ పార్టీ లో ఉండే వారే మెగా అభిమానులని, వారికి మాత్రమే టికెట్లు దక్కాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో డిసెంబర్ 9 న చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ చిత్రం నగరంలోని సిరి మల్టీప్లెక్స్, నర్తకి థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. టికెట్ల కోసమంటూ కొంతమంది అభిమానులు 7వ తేదీన సిరి మల్టీప్లెక్స్ మేనేజర్ శ్రీనివాసులును సంప్రదించారు. తాము చిరంజీవికి ఎన్నో సంవత్సరాలుగా అభిమానులమని తమ సంఖ్యా బలం తెల్పుతూ అభిమానుల టికెట్ల వాటాలో 30% తమకు ఇవ్వాల్సిందిగా కోరారు. దీనికి మేనేజర్ శ్రీనివాసులు ఇప్పటికే చిరంజీవి యువత పేరుతో టికెట్లు కావాలని అడిగి ఉన్నారు, మీరు వారితో తేల్చుకోండి అని చిరంజీవి యువత అభిమాన సంఘం నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, రవి కుమార్, చంద్రశేఖర్ రెడ్డి లకు సమాచారం ఇచ్చారు. దీంతో రెండో వర్గం కూడా థియేటర్ వద్దకు చేరుకోగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉండే వారే మెగా అభిమానులని, మీకు టికెట్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీలోకి చేరి చిరంజీవి యువతలోకి వచ్చి పనిచేయండని స్పష్టం చేసారు. దీంతో మరో వర్గం పార్టీలకు అతీతంగా చిరంజీవి అభిమానులు ఏకం కండి అని మెగా హీరోలు తెల్పుతుంటే ఇక్కడ మీరేమో కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ పార్టీ పేరుతో అభిమానులను మాత్రం దూరం చేసేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వారిని చిరంజీవి యువత కార్యక్రమాలకు అతిథులుగా పిలుస్తున్నారని, వారికి వాటాలు పంపుతున్నారని నిలదీశారు. వారు వీఐపీలు కాబట్టి పిలుస్తున్నాం, వాటాలు పంపుతున్నాం అని ఓ వర్గం తెల్పగా అభిమానుల కంటే వీఐపీలు ఎవ్వరూ కాదని మరో వర్గం బదులిచ్చారు. ఇలా గొడవ తీవ్రరూపం దాల్చడంతో థియేటర్ యాజమాన్యం కలుగజేసుకుని సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. కాగా తమకు రావాల్సిన టికెట్లు తమకు ఇవ్వట్లేదని, అభిమానులకు టికెట్లు దక్కకుండా చేస్తున్నారని చిరంజీవి అభిమానులు సుజయ్ బాబు, చక్రవర్ధన్ రెడ్డి, మదన్, సనత్, వెంకటరమణ మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ టికెట్ల పంపిణీ పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. అభిమానుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే అభిమాన సంఘాల వారికి టికెట్లు ఇవ్వండని లేకపోతే థియేటర్ వద్ద క్యూలోనే ఇవ్వండని థియేటర్ యాజమాన్యానికి పోలీసులు తేల్చిచెప్పారు.
వచ్చే నెలలో విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’ సమయంలో ఈ వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే మెగా అభిమానులు అని తెలిపే అభిమాన సంఘ నాయకులు కొంతమంది ‘కాంగ్రెస్ పార్టీని ఈ దేశం నుండి తరిమికొట్టండి – దేశాన్ని కాపాడండి’ అని పిలుపిచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రాల విడుదల సమయంలో టికెట్లు మాకే కావాలి, మేమే అభిమానులం అని పట్టుబట్టిన సందర్భాలు సైతం ఉన్నాయి.
ఇదిలా ఉండగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వెబ్ సైట్ లు అయిన JusTickets, Paytm లలో ‘ధృవ’ నర్తకి, సిరీ థియేటర్లలో టికెట్లు కొద్ది సంఖ్యలో అమ్మకానికి పెట్టారు. సాధారణంగా టికెట్లు ఆన్ లైన్ లో వదిలిన నిమిషాల వ్యవధిలోనే ఆదివారం వరకూ దొరక్కుండా అమ్ముడయ్యే టికెట్లు రెండు రోజులు దాటినా లభ్యమవుతున్నాయి. నోట్ల రద్దు కష్టాల నేపథ్యంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని పలువురు భావిస్తున్నారు. దీంతో ఇటు మొదటి రోజు టికెట్ల వ్యవహారంలో అభిమానుల మధ్య విబేధాలు, అటు ఆన్ లైన్ లో తగ్గిన ఆదరణతో రామ్ చరణ్ ‘ధృవ’ చిత్రం నెల్లూరు నగరంలో ఓపెనింగ్స్ కష్టాలను ఎదుర్కొంటున్నది.