జియో బిల్లుల్లో నిజమెంత?
November 23, 2016
రిలయన్స్ జియో డిసెంబర్ 30వరకు ఫ్రీ కదా మరి బిల్లులు ఏమిటి అని అనుకుంటున్నారా? రిలయన్స్ జియో వెల్ కమ్ ఆఫర్ ఫ్రీ అయినా కొంతమంది కస్టమర్ల ఆధార్ లో ఉండే అడ్రస్ ఆధారంగా జియో నుండి బిల్లులు అందినట్లు నెటిజన్లు సోషల్ మీడియా లో బిల్లులను షేర్ చేస్తున్నారు. ఓ కస్టమర్ కు 27718.5 రూపాయల బిల్లు వచ్చిందని గడువు దాటితే వెయ్యి రూపాయల ఫైన్ తో మొత్తం 28818.5 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపే బిల్లు ఒకటి ఇప్పుడు ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ లలో చక్కర్లు కొడుతుంది. ఈ బిల్లును చూసిన పలువురు తొలుత షాక్ అవుతుండగా తర్వాత ఆలోచించి ప్రీ పెయిడ్ సిమ్ములకు పోస్ట్ పెయిడ్ బిల్లు ఎలా వస్తుందని అంటున్నారు. ఈ బిల్లు చూస్తే ఫేక్ లా ఉందని నవంబర్ 11 నుండి 17 వరకు కాలానికి నవంబర్ 20 బిల్లు చెల్లించేందుకు చివర తేదీగా పేర్కొన్నారని, ఇలా 7 రోజుల కాలానికి బిల్లు వచ్చి మూడు రోజుల్లో చివరి తేది పెట్టి కట్టమని ఎక్కడైనా జరుగుతుందా అని తెలుపుతున్నారు. పైగా 7 రోజుల కాలానికి 554 జి.బి. డేటా వాడినట్లు ఉందని, అలా ఎవరైనా వాడుతారా అని పేర్కొంటున్నారు. ఇదంతా ఎవరో కావాలనే చేస్తున్నారని పలువురు సోషల్ మీడియాలోనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.