కాలికున్న చెప్పును తీసుకుని కొట్టుకున్న వైసీపీ నేత..!
జిల్లాల పునర్విభజన వైసీపీ నేతల మద్య చిచ్చు రాజేస్తోంది. అంతేకాదు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకునేలా దారితీస్తోంది. గెలిపించినందుకు తమంతట తామే చెప్పుతో కొంటున్నారు కూడా. ఇంతకీ ఎక్కడా ఘటన?..ఏమిటా విషయం. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంను జిల్లా చేయాలని కొన్ని రోజులుగ ప్రజలు, పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి. ఇందులో వైసీపీ నేతలు కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ డిమాండ్ ఇప్పుడు వైసీపీ అగ్గిరాజేసింది. అఖిలపక్షం ఆధ్వర్యంలో నర్సాపురంలో ర్యాలీ, నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు ఆవేశానికి లోనయ్యారు.
నిరసన దీక్షలో ఆయన మాట్లాడుతూ 2019లో నర్సాపురం ఎమ్మెల్యేగా అసమర్థుడైన ముదునురి ప్రసాద్‌రాజును గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకుంటున్నట్టు ప్రకటించడమే కాకుండా కాలుకున్న చెప్పును తీసుకుని చెంపకేసి కొట్టుకున్నారు. ప్రసాద్‌రాజుకు మద్దతుగా నిలిచి, ఆయన గెలుపులో పాలుపంచుకున్నందుకు నియోజకవర్గ ప్రజలు క్షమించాలని ఆయన వేడుకున్నారు. ఇదిలా వుండగా కొత్తపల్లి సుబ్బరాయుడు తనను తాను చెప్పుతో కొట్టుకోవడంతో అక్కడ కలకలం రేగింది. నిరసన సభలో పాల్గొన్న వాళ్లంతా ఆశ్చర్యానికి లోనయ్యారు.
నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా సాధించుకోవడంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ముదునురి ప్రసాద్‌రాజు విఫలమయ్యారనేది ఆ ప్రాంత వాసుల ఆవేదన, ఆక్రోశం. అదంతా కొత్తపల్లి సుబ్బరాయుడు తన చేతల్లో చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని ఎమ్మెల్యే అనుచరులు ఆరోపిస్తున్నారు. ఏదైనా ఉంటే అధిష్టానంతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలిగానీ ఇలా ప్రవర్తించడం సమంజసం కాదని వాదిస్తున్నారు. జిల్లాల పునర్వ్యస్థీకరణ పుణ్యమా అని ఎమ్మెల్యే, సుబ్బరాయుడు మధ్య విభేదాలు బయటపడ్డాయి.