న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా..?: వైసీపీ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థలలో ఎవరు గొప్పా..? అని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ గొప్పదో..శాసన వ్యవస్థ గొప్పదో పూర్తి స్దాయి లో చర్చ జరగాలి..న్యాయ వ్యవస్థ నిద్ర పోతుందా..? అని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలగేలా చేయాలన్నారు. అంబేద్కర్ రాజ్యంగాన్ని అవమానపరుస్తారా అని మండిపడ్డారు. ప్రజలకు అవసరమైన అంశాలను కోర్టులు టేబుల్ మీదకు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. తమకు అవసరమైన అంశాలపైనే కోర్టు పరిగణలోకి తీసుకుంటుందని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన ఎలా జరిగిందో దేశ ప్రజలకు తెలుసని వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్టాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. అందులో బీజేపీ పాత్ర కూడా ఉందన్నారు. రాష్ట్ర విభజనపై వేసిన పిటిషన్లపై ఎందుకు వాదనలు జరగడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాలు చెల్లవని కోర్టులు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మూడు రాజధానులకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఎన్నిక చెల్లదని కోర్టులో పిటిషన్ వేశామని, 2019లో వేసిన పిటిషన్ ను కోర్టు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ముందు రాష్ట్ర విభజన పిటిషన్లపై తీర్పులు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.
అయితే ఇప్పుడు మోదుగులు వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇదిలా ఉండగా రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించి సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ నేతలు తెలిపారు. రాజధానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ప్లాట్ల అభివృద్ధి మూడు నెలల్లో సాధ్యమవుతుందా? అని బొత్స ప్రశ్నించారు. సీఆర్డీఏ చట్టం అమలుకు తాము వ్యతిరేకం కాదని, ఇది సమయం, ఖర్చు, నిధులతో ముడిపడి ఉందని, ఏదైనా సమాఖ్య వ్యవస్థకు లోబడి ఉండాలన్నారు.