అసమర్థ పాలనతో సీఎం జగన్ ఎప్పుడో జీరో అయ్యాడు : చంద్రబాబు
అసమర్థ పాలనతో సీఎం వైఎస్ జగన్ జీరో అయ్యాడని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారాచంద్రబాబు నాయుడు అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై టీడీపీ నిరసనలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనతో జగన్ ఉలిక్కి పడ్డారని చంద్రబాబు అన్నారు. వైసీపీ అధినేతకు ఎన్నికల్లో ఒటమి తప్పదని అర్థం అయ్యిందని..దాన్ని కప్పిపుచ్చేందుకే 175 సీట్లు గెలుస్తామని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రజలను జగన్ ప్రభుత్వాన్ని కుంపటిలా భావిస్తున్నారని…నెత్తిన పెట్టుకున్న ఈ కుంపటిని ఎప్పుడు దించుకోవాలా అని చూస్తున్నారని చంద్రబాబు అన్నారు. బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు కార్యక్రమంపై మండల అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో చంద్రబాబు అన్లైన్ సమావేశంలో సమీక్షించారు.
వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా బ్రష్టుపట్టిపోయిందని…దాన్ని దాచి పెట్టేందుకే సిఎం జగన్ తాజా పాట్లు పడుతున్నాడని చంద్రబాబు సమావేశంలో అన్నారు. 175 సీట్లు ఎందుకు రావు అంటున్న జగన్ ఈ సారి సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతారని…ప్రజల్లో ఆస్థాయి వ్యతిరేకత ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ను మళ్లీ ఎందుకు గెలిపిస్తారు… పన్నులతో ప్రజలను బాధినందుకా…ఇరిగేషన్, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసినందుకా తన వైఫల్యాలతో పోలవరం, అమరావతి లాంటి ప్రాజెక్టులను బలిచేసినందుకా అని ప్రశ్నించారు. ఆసుపత్రులలో మృతదేహాల తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వలేని ప్రభుత్వాన్ని తిరిగి ఎన్నుకోవాలని ప్రజలు ఎందుకు అనుకుంటారని చంద్రబాబు ప్రశ్నించారు.
విద్యా, వైద్య, సాగునీటి, వ్యవసాయంతో సహా ఏ రంగంలో నాడు నేడు పై చర్చకు సిద్దం అని చంద్రబాబు అన్నారు. గ్రామ స్థాయిలో వైసీపీ వైఫల్యాలతో పాటు, దోపిడీని కూడా ఎండగట్టాలని చంద్రబాబు క్యాడర్ కు పిలుపునిచ్చారు. ఇకపోతే కార్యక్రమాలు, నేతల పనితీరుపైనా చంద్రబాబు నేతలకు సూచనలు చేశారు. ఒక నియోజకవర్గ ఇంచార్జ్…ఇంకో నియోజకవర్గంలో వేలు పెట్టడానికి వీలులేదని తేల్చి చెప్పారు. ఈ మూడేళ్లు బయటకు రాని కొందరు నేతలు…ఇప్పుడు తెలుగు దేశం గెలుపు ఖాయం అని తెలిసి యాక్టివ్ అవుతున్నారని చంద్రబాబు అన్నారు.