నిందితులెవరైనా శిక్షిస్తాం : మంత్రి వనిత
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో జరిగిన గంజి ప్రసాద్ హత్య సంఘటన దురదృష్టకరమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. వైసీపీ నేత గంజి ప్రసాద్ కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. జి.కొత్తపల్లిలో బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం ఆమె పరామర్శించారు. గంజి ప్రసాద్ మృతి పార్టీకి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. హత్య కేసులో కొంతమంది వ్యక్తులు పోలీసులకు లొంగిపోయారు అని, నిందితులు ఇచ్చిన సమాచారంతో బజారయ్య అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారని తెలిపారు.
హత్య వెనక ఉన్న నిందితులను పూర్తి స్థాయిలో విచారించి, చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటనపై పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. గ్రూపు తగాదాల వల్లే హత్య జరిగిందన్న అనుమానం వ్యక్తమవుతోందని తెలిపారు. అయితే వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య వెనక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఉన్నారని, ఆయన వర్గమే హత్య చేయించారని ప్రత్యర్థి వర్గం తీవ్రంగా మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఆయనపై ఆయన్ను కొట్టి ఊరి నుండి తరిమేశారు.
ప్రాణ భయంతో స్కూలులోనే దాక్కున్నారు. జిల్లా ఎస్పీ వచ్చి పరిస్థితిని అదుపు చేసే వరకు వివాదం సర్దుమనగ లేదు. సుమారు నాలుగు గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే తనపై చేయి చేసుకున్న వారిలో టీడీపీ నేతలు ఉన్నారని, టీడీపీ వారే దాడికి పాల్పడ్డారని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆరోపించారు. హత్య వెనక ఆరోపణలు ఎదుర్కొంటున్న బజారయ్య లొంగిపోయారు. పోలీసుల విచారణకు సహకరిస్తానని, ఎలాంటి భూ వివాదంలో తాను జోక్యం చేసుకోలేదని ప్రకటించారు.