మంత్రి పదవి కోసం కర్నూలు నేతల్లో పోటీ
రాష్ట్రంలో త్వరలో మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విస్తరణలో పదువులు పొందేందుకు నేతలు పోటీలు పడుతున్నారు. ఇప్పటికే అధిష్టానం వద్ద కూడా తమ ప్రొపోజల్స్ పెట్టినట్లు కూడా తెలుస్తోంది. అయితే కర్నూలు జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వరిస్తోందనన్న ఆసక్తి ఎక్కువైంది. బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మద్యం మంత్రి పదవి కోసం పోటీ నెలకొంది. ఇప్పటికే ఆరు సార్లు గెలిచి గట్టి స్థానాన్ని సంపాదించుకున్న కాటసాని తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు.
జిల్లాలో సీనియర్ నాయకులు కావడం, జగన్ కు విధేయులుగా ఉండటం తనకు కలిసి వస్తుందని లెక్కలేసుకుంటున్నారు. మొదటిసారే ఆశించినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఆ సమయంలో ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని మంత్రి పదవి వరించింది. దీంతో ఈ సారి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక శ్రీశైలం నుండి మొదటి సారి గెలిచిన శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ముమ్మర ప్రయత్నాలే చేస్తున్నారు.
గతంలో టీడీపీ నుండి వైసీపీలో చేరినప్పుడు తన ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేశారు. వైసీపీలో చేరడానికి చేసిన ఈ త్యాగంతో తనకు పదవి వస్తుందని శిల్పా చక్రపాణి రెడ్డి కూడా ఆశతో ఉన్నారు. అంతేకాదు మొదటి సారి పోటీ చేసి బలమైన బుడ్డా రాజశేఖర్ రెడ్డిని ఓడించిన క్రెడిట్ కూడా తనకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఈ ఇద్దరికి పదవి ఇస్తారా..లేదా ఇద్దరినీ కాదని మరొకరు మంత్రి పట్టుకుపోతారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.