అవినీతి, అనాలోచిత నిర్ణయాలతోనే విద్యుత్ రంగం నిర్వీర్యం : చంద్రబాబు

ప్రజల జీవనోపాధికి భద్రత కల్పించడం, అభివృద్ధిని వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించే విద్యుత్‌ రంగానికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా విద్యుత్‌ రంగం వెన్నెముక లాంటిదని, నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్‌ అందించినపుడే పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు రాష్ట్ర పురోభివృద్ధికి అండగా నిలుస్తాయన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదివారం ఆయన లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, ప్రణాళికాలోపం కారణంగా నేడు రాష్ట్రంలో విద్యుత్‌ రంగం నిర్వీర్యమైందని పేర్కొన్నారు. కరెంటు కోతలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు కారణంగా భవిష్యత్‌ అంధకారం అవుతోందని, దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.

2014లో రాష్ట్ర విభజనానంతరం రాష్ట్రంలో 22.5 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ లోటు ఉండేదని, విద్యుత్‌ రంగంలో సంస్కరణలు అమలు చేస్తూ.. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు అందించి 2019 నాటికి 9,529 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తిని 19,160 మె.వా.కు పెంచినట్లు గుర్తు చేశారు. దేశంలో మిగులు విద్యుత్‌ ఉన్న మూడు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌ ను ఒకటిగా నిలిపామన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచేది లేదు.. ఒక్క నిమిషం కరెంటు కోత విధించేది లేదు అని గర్వంగా చాటి చెప్పామని తెలిపారు. సాంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా సౌర, పవన విద్యుత్‌ వంటి పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యమిచ్చినట్లు గుర్తు చేశారు.

అందులో భాగంగానే.. దేశంలోనే అతి తక్కువ ధరకు సోలార్‌, విండ్‌ విద్యుత్‌ కొనుగోళ్లకు సంబంధించి 25 సంవత్సరాలకు ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు. భవిష్యత్‌ అవసరాలను గుర్తించి.. 2024 వరకు డిమాండుకు సరిపడా విద్యుత్‌ ఉత్పత్తి సామర్ధ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే రూపొందించామని, కానీ.. విద్యుత్‌ ఉత్పత్తి పెంచడంలో ప్రస్తుత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న విద్యుత్‌ కోతలు, ధరల వాతలకు.. ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష పూరిత విధానాలు, అవినీతే కారణని ఆరోపించారు.

 

 

Add a Comment

Your email address will not be published. Required fields are marked *