ఎప్పుడు ఎన్నికలొచ్చినా 160 సీట్లు మావే : అచ్చెన్నాయుడు
ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీ వైపే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 160 స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. ఇటీవల వైసీపీ చేసిన సర్వేలో ఆ పార్టీకి 30 సీట్లు కూడా రావని తేలిందని తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒంగోలులో ఆయన పర్యటించారు. మే నెల 28న నిర్వహించనున్న మహానాడుకు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఒటమి అంచుల్లో వైసీపీ ఉండటం వల్లే జగన్‌లో అసహనం పెరిగి.. ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్నారని విమర్శించారు.
రాష్ట్రంలోని ప్రతి వర్గం జగన్ బాధితులేని అన్నారు. ప్రభుత్వంపై తిరగబడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. మూడేళ్లలో 800 మంది మహిళలపై అత్యాచార ఘటనలు జరిగాయని ఆరోపించారు. ఆదిలోనే కఠినంగా ఉంటే ఈ పరిస్తితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ మహిళా కార్యకర్తలపై అసభ్యకర పోస్టులతో వేధింపులకు అధికార పార్టీ పాల్పడుతోందని మండిపడ్డారు. వేధింపులపై పిర్యాదు చేసినా మహిళా కమిషన్ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూడేళ్లుగా పోలవరం ప్రాజెక్టును గాలికి వదిలేశారని ఆరోపించారు. కౌలురైతుల కుటుంబాలకు పవన్ సాయం చేస్తే వైసీపీకి ఎందుకు బాధ అని ప్రశ్నించారు. వైసీపీకి గడ్డుకాలం ఎదరవబోతోందని, ప్రజలు చిత్తుగా ఓడిస్తారని అన్నారు. విచ్చలవిడిగా వైసీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసుల నుండి తప్పించుకునేందుకు కోర్టుల్లో దూరి పత్రాలను వైసీపీ నేతలు దొంగిలిస్తున్నారని ఆరోపించారు. ఒంగోలులో మహానాడును ఘనంగా నిర్వహిస్తామని, మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు.