జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది- గోరంట్ల
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై తెదేపా పార్టీ నేత గోరంట్ల పుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఓట్లేసి గెలిపించిన ప్రజల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారంటూ మండిపడ్డారు. ఓటీఎస్ పేరుతో పేదలను ప్రభుత్వం దోచుకుంటోందని అన్నారు. గత ప్రభత్వాలు పేదలకు ఇళ్లు, స్థలాలు ఇచ్చాయని.. అయితే, జగన్ ప్రభుత్వం మాత్రం దోపిడే లక్ష్యంగా ఓటీఎస్ పద్దతిని అమలు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. డ్వాక్రా మహిళల నుంచి కూడా ప్రభుత్వం వారి కష్టాన్ని బలవంతంగా లాక్కోవడం దారుణమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ అమ్మకానికి పెట్టారని.. ఏపీలో ప్రభుత్వం శాడిస్ట్ ప్రభుత్వం రాజ్యమేలుతోందని దుయ్యబట్టారు.
ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వంపై తిరుగుబాటు మొదలైందని.. జగన్ పాలనలో రాష్ట్రం అతలాకుతలమైపోతోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ఓటీఎస్ పద్దతిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓటీఎస్ కోసం ప్రజలను ఒత్తిడి చేస్తున్నారని నిరూపిస్తే.. బొత్సా సత్యనారాయణ రాజీనామా చేస్తారా అంటూ ప్రశ్నించారు.
కాగా, ఇటీవలే తెదేపా అధ్యక్షుడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జగన్ స్వయంగా అసెంబ్లీ వేదికగా క్షమాపణు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు, రాష్ట్రంలో పెరిగిన విద్యుత్, ఆర్టీసీ, పెట్రోల్ తదితర పన్నుల గురంచి కూడా స్పందించారు. రాష్ట్రాన్న అదానీకి అమ్మేందుకు జగన్ సిద్ధమయ్యాడని ఆరోపించారు.