జగన్ వెయ్యి తప్పులు చేశాడంటూ పుస్తకం విడుదల చేసిన టీడీపీ
జగన్ విధ్వంస పాలనకు వెయ్యి రోజులు పూర్తైందని, వెయ్యి రోజుల్లో జగన్ 1000 నేరాలు, ఘోరాలు చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నక్కా ఆనందబాబు, ఏలూరి సాంబశివరావు, చిన్నరాజప్ప, అశోక్ బాబు, దీపక్ రెడ్డితో కలిసి విధ్వంస పాలనలో 1000 నేరాలు, ఘోరాలు, లూటీలు, అబద్ధాలు పేరిట ప్రజా ఛార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘సాధారణంగా ఎవరైనా ఒక మంచి పనితో పాలన ప్రారంభిస్తారు. అశుభ కార్యంతో జగన్ పాలన ప్రారంభించారు. ప్రజావేదిక కూల్చివేతతో పాలన ప్రారంభించారు.
చంద్రబాబు అందరి అభిప్రాయాలు తీసుకుని అమరావతిని రాజధానిగా నిర్ణయించుకుని, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క పైసా భారం లేకుండా ల్యాండ్‌పూలింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములు ఇచ్చారు. రాజధాని నిర్మించుకుని పాలన చేసిన సంగతి అందరికి తెలిసిందే. చంద్రబాబుకు పేరు వస్తుందని అమరావతిని చంపేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక అమరావతిని చంపేసి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల నిర్ణయంతో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదు.
మన రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుదారులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వైసీపీ పాలనలో 226 దేవాలయాలపై దాడులు జరిగాయి. దేశ చరిత్రలో ఎక్కడైనా రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిందా?. తప్పులను ప్రశ్నిస్తే దాడులు చేసే పరిస్థితి. తాడేపల్లిలో జగన్ ఇల్లు ఇందని పేదవాళ్ల గుడిసెలన్నీ కూల్చివేశారు. విగ్రహాలపై దాడి జరిగితే సీఎం జగన్ ఏమాత్రం స్పందించలేదు. ప్రజల పక్షాన పోరాడిన కోడెలను పొట్టన పెట్టుకున్నారు. మూడేళ్ల జగన్ రెడ్డి పాలనలో అన్నీ నేరాలు, ఘోరాలే. ప్రజలకు మంచి చేద్దామన్న సొంత పార్టీ ఎంపీనే పోలీసులతో కొట్టించారు’’ అని దుయ్యబట్టారు.