సబ్ ప్లాన్ నిధులు వృధా అయితే సహించేది లేదు : మంత్రి మేరుగ
రాష్ట్రంలో ఎస్సీల అభ్యున్నతి కోసం కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో ఒక్క రుపాయి వృధా అయినా సహించేది లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున స్పష్టం చేసారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్లో ప్రతిపైసా కూడా ఎస్సీల అభివృద్ధికి ఉపయోగపడేలా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులమీదే ఉందని పేర్కొన్నారు.రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ ఉప ప్రణాళికపై గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి నాగార్జున మాట్లాడుతూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసారు. ఒక ఆర్థిక సంవత్సరంలో వాడుకోకుండా మిగిలిపోయిన నిధులను మరో సంవత్సరంలో వాడుకొనే అవకాశం సబ్ ప్లాన్ నిధుల్లో ఉండదని వెల్లడించారు.
అందుకే ఏ ఆర్థిక సంవత్సరంలో మంజూరు చేసిన నిధులను అదే ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే సబ్ ప్లాన్ ద్వారా బడుగు వర్గాల వారి అభ్యున్నతి కోసం మంజూరు చేసిన నిధులలో ప్రతి పైసా కూడా సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆదేశించారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2019-20లో రూ.15000 కోట్లు, 2020-21లో రూ.15735 కోట్లు ఎస్సీ సబ్ ప్లాన్ కోసం కేటాయించారని, అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులను మరింతగా పెంచి రూ.17403 కోట్లను కేటాయించారని నాగార్జున వెల్లడించారు. ముఖ్యమంత్రి తో మంచి మనసుతో కేటాయించిన ఈ నిధుల్లో ఒక్క రుపాయి వృధా అయినా ఒప్పుకునేది లేదని చెప్పారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు తమ పరిధిలోని సబ్ ప్లాన్ నిధులను పూర్తిగా వినియోగించుకొనేలా అంచనాలను రూపొందించుకోవాలని సూచించారు.