అంబేద్కర్ పేరు పెట్టాలని పార్టీలు, ప్రజలు డిమాండ్ చేశారు. మంత్రి తానేటి వనిత
కోనసీమ జిల్లాను అంబేద్కర్ కోనసీమ జిల్లా గా మార్చాలని స్థానిక ప్రజలు, అన్ని వర్గాలు, పార్టీలు డిమాండ్ చేసాయని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఈ మధ్యనే ప్రభుత్వం పేరు మార్చిందని పేర్కొన్నారు. అమలాపురంలో జరిగిన హింసపై హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. డా.బీఆర్ అంబేద్కర్ మహా మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,, ఆయన ఎంతో మందికి స్ఫూర్తి దాయకం అని వివరించారు. అలాంటి మహానుభావుని పేరును ఒక జిల్లాకు నామకరణం చేయడాన్ని వ్యతిరేకించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కోనసీమ జిల్లా ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్ కోనసీమగా పేరు మార్చిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని మండిపడ్డారు. గొడవలు చేసే వారి వెనుక ఉండి నడిపించే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారని, స్కూల్ బస్సులను కూడా తగులబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని కొన్ని శక్తులు కుట్ర పూరితంగా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అలాంటి వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని, పోలీసులపై జరిగిన దాడిని తీవ్రంగ ఖండిస్తున్నట్లు తెలిపారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై తప్పక చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను అదేశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితి అదుపులోనే ఉందని, 144 సెక్షన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.