అలా జరిగితే రాజకీయాల నుంచే తప్పుకుంటా- పరిటాల శ్రీరామ్
ఇటీవల కాలంలో రాజకీయాల్లో యువత ఎక్కువగా పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లోనూ వారు నిలబడి భారీ మెజార్టీలతో గెలుపొందడం గమనార్హం. తమ నియోజకవర్గాల్లో వారికున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా ఉండదు. సుమారు ఓ హీరోకు ఉన్నంత క్రేజ్‌ను మేన్‌టేన్ చేసూంటారు. అలా ధర్మవరం నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న పరిటాల శ్రీరామ్ కూడా ఒకరు. పరిటాల రవి తనయుడిగా రాజకీయాల్లో అరంగెట్రం చేసిన ఆయన.. తన నియోజకవర్గంలో మంచి పనులు చేస్తూ.. ముఖ్యంగా యువతకు అండగా నిలుస్తున్నారు.
కాగా, ధర్మవరంలో తెదేపా టికెట్ తెచ్చుకుంటానని చెప్పిన ఓ నాయకుడిపై పరిటాల శ్రీరామ్ మాటలతో విరుచుకుపడ్డారు. అలా టికెట్ తెచ్చుకుంటే.. తాను శాస్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. శనివారం ధర్మవరంలోని దుర్గానగర్‌లో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యలపై చర్చావేదిక కార్యక్రమానికి పరిటార శ్రీరామ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. టీడీపీ శ్రేణులు ఎవ్వరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. పార్టీ అభివృద్ది చేయడంలో మాత్రమే మన దృష్టి సారించాలని సూచించారు.
ప్రస్తుత ప్రభుత్వం చేతగాని తనాన్ని వేలెత్తి చూపించి.. ప్రజలకు తెలియజేయాలని అన్నారు. వారి వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అన్న విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దని. .ప్రజలు కూడా ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాటమయ్య, రవిచంద్ర, ఓబులేశు తదితరులు పాల్గొన్నారు. మరి శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలకు సవాల్ విసిరిన ఆ నాయకుడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.