ఇప్పుడు మనది 26 జిల్లాల ఆంధ్రరాష్ట్రం : సీఎం జగన్
నిజంగా ఏప్రిల్ 4 శుభదినమని, ఆంధ్రరాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా జరిగే మంచిని నేటి నుండి మనమంతా గ్రామస్ధాయి నుంచి చూశామని ఏపీ సీఎం జగన్ అన్నారు. జిల్లా స్ధాయిలో కూడా ఆ వికేంద్రీకరణ జరగడంతో రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ప్రారంభమైందన్నారు. ఇప్పటి నుండి మనది 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుమారుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు, కొత్త కార్యాలయాలు ద్వారా సేవలందించేందుకు కొత్త జిల్లాలకు చేరుకుని పనులు ప్రారంభిస్తున్న అధికారులకు, కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉద్యోగులు అందరికీ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
దేశంలో జనాభా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సుమారుగా 100 కోట్లు పెరిగిందని, నాడు జనాభా దాదాపుగా 35 కోట్లు అయితే ప్రస్తుతం జనాభా 138 కోట్లు అని జనాభా లెక్కలు చెబుతున్నాయని, ఆ రోజు కలెక్టర్లుకు ఉన్నది అజమాయిషీ, అధికారం అయితే.. ప్రస్తుతం కలెక్టర్లకు అధికారంతో పాటు మన ప్రజల పట్ల బాధ్యత ఎక్కువగా ఉన్నాయన్నారు. మారుతున్న ప్రపంచంతో పాటు ప్రజలందరికీ అందించే సేవల్లో ప్రభుత్వ పాత్ర, ప్రజల అవసరాలు, ఆకాంక్షల మేరకు మార్పు చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.
ప్రతిఒక్క గ్రామం, ఇంటింటికీ, గడప, గడపకూ చేరే పరిపాలన నేడు మనమంతా చూస్తున్నామని, ఈ మూడేళ్లలో పౌరసేవలు ఎలా పెరిగాయో.. వాటిని అందించడంలో ఏ రకమైన మార్పులు చోటు చేసుకున్నాయో మనమంతా గమనించాలన్నారు. పౌరసేవల్లో వేగం పెరిగి, పారదర్శకత పెరిగిందని, అవినీతి, వివక్ష వంటి వాటిని పూర్తిగా రూపుమాపిన పరిస్థితిలోకి వ్యవస్ధలు తయారయ్యాయన్నారు. సంతృప్తి స్ధాయిలో ప్రతి అవకాశం, ప్రతి పథకం నేడు అమలుతున్నాయని స్పష్టం చేశారు.