ఐసెట్ విద్యార్ధులకు సమాచారం… నెల్లూరు యూనివర్శిటీలో ఈ కోర్సుతో విస్తృత అవకాశాలు
విక్రమ సింహపురి యూనివర్శిటీ నెల్లూరులో ఎంబిఎ టూరిజం మేనేజ్ మెంట్ కోర్సు లభిస్తున్నది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఇటు ప్రభుత్వ రంగంలో, అటు ప్రైవేట్ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు కలవు. ప్రైవేట్ యూనివర్శిటీలు, సంస్థల్లో లక్షల రూపాయలు కట్టి చదివే ఈ కోర్సు మన ప్రభుత్వ యూనివర్శిటీ లో రెగ్యులర్ కోర్సుగా అతి తక్కువ ఫీజుతో లభిస్తున్నది. కరోనా కారణంగా గత సంవత్సరానికి పైగా స్తబ్దత ఏర్పడిన పర్యాటక రంగం ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చిన తరువాత సరికొత్త పుంతలు తొక్కుతోంది. రానున్న రోజుల్లో మరిన్ని అవకాశాల దిశగా పయనిస్తోంది. నూతన ప్రదేశాలు, అవకాశాలు, ఆవిష్కరణలతో ఎప్పుడూ స్థిరంగా ఉండే పర్యాటక రంగంలో ఉపాధి ఏర్పాటు చేసుకుంటే కెరీర్ ఎప్పుడూ నిలకడగా ఉంటుంది.
నెల్లూరులో ఈ కోర్సు చేరే విద్యార్థులకు ఎంబీఏ లో కేవలం టూరిజం మాత్రమే స్పెషలైజేషన్ గా కాకుండా డ్యూయల్ స్పెషలైజేషన్ పొందే అవకాశం ఉంది. అంటే విద్యార్థులు తొలి ఏడాది రెండు సెమిస్టర్లలో సాధారణ ఎంబీఏ విద్యార్థులు చదివే అన్ని సబ్జెక్టులు చదువుతారు. రెండో ఏడాది మూడు, నాలుగో సెమిస్టర్లలో టూరిజంతో పాటు హెచ్.ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ వీటిల్లో ఏవైనా రెండు స్పెషలైజేషన్లను చదివే ఉంటుంది. దీంతో విద్యార్థులు కోర్సు పూర్తయిన తరువాత కేవలం టూరిజం లోనే కాకుండా తాము నైపుణ్యం సంపాదించిన రంగంలో స్థిరపడే అవకాశం ఉంది.
ICET Counseling ద్వారా మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుని ఈ కోర్సు చేరవచ్చు. విక్రమ సింహపురి యూనివర్శిటీలో ఎటువంటి మేనేజ్మెంట్ సీట్లు కాని, స్పాట్ అడ్మిషన్ కానీ ఉండదు.
రెండేళ్ళ ఈ కోర్సులో మొత్తం 33 సీట్లు ఉండగా ప్రభుత్వ రెగ్యులర్ కోర్సు కనుక ఫీజు ఏడాదికి కేవలం 10వేల రూపాయలు మాత్రమే.
ప్రభుత్వ ఫీజు రీఎంబర్స్ మెంట్ కు అర్హత కలిగిన వారు యూనివర్శిటీ కాలేజీలో ఈ కోర్సులో ఉచితంగా చేరవచ్చు.
దూర ప్రాంత విద్యార్థులకు యూనివర్సిటీ క్యాంపస్ లో హాస్టల్ సౌకర్యం కలదు.