ఒకటి కాదు.. రెండు కాదు 14 పెళ్లిళ్లు.. ఏడు రాష్ట్రాలకు అల్లుడయ్యాడు!
ఇటీవల కాలంలో ఒక్కపెళ్లికే నానాయాతన పడుతుండగా… ఓ పెద్దాయన మాత్రం ఏకంగా 14 పెళ్లిళ్లు చేసుకున్నాడు. సరదాగా వివాహం చేసుకోవడం… పని ఉందని చెప్పి చెక్కేయడం… ఇలా 14 మంది మహిళలు మోసగించి తాళికట్టాడు. బాధితులు వివిధ రాష్ట్రాలకు చెందినవారు కావడంతో అయ్యగారి అసలు స్వరూపం తెలియడానికి కాస్త సమయం పట్టింది. ఓ ఉపాధ్యాయురాలి చొరవతో ఈయనగారి బండారం మొత్తం బయటపడింది. ఇంకా చేసేది లేక పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తాను 14 మందిని వివాహమాడినట్లు అంగీకరించాడు.
ఒడిశా కేంద్రపరి జిల్లాకు చెందిన బిధు ప్రకాష్ స్వైన్ అనే వ్యక్తికి ఏకంగా 14 పెళ్లిళ్లు అయ్యాయి. వైద్యుడినని చెప్పుకుంటూ మహిళల్ని మోసం చేస్తూ తాళి కడుతున్నాడని ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఒంటరి మహిళలనే లక్ష్యంగా చేసుకొని ఈ తతంగాన్ని నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. ఫేక్ ప్రొఫైల్ తో మ్యాట్రిమోని ద్వారా పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు గుర్తించారు. అయితే ఇటీవల కూడా దిల్లీకి చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆర్యసమాజ్ లో పెళ్లయిన తర్వాత… కొన్ని రోజులు కాపురం చేశాడు. భువనేశ్వర్ లో పని ఉందని చెప్పిన వ్యక్తి… ఎంతకీ తిరిగిరాలేదు. అనుమానం వచ్చిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. కాగా అసలు విషయం బయటకు వచ్చింది.
బిధు ప్రకాశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కాగా 14 మందిని పెళ్లి చేసుకున్నట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. బాధితులు అసోం, పంజాబ్, దిల్లీ, ఝార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారని చెబుతున్నారు. వారి వివరాలను సేకరించే పనిలో పడ్డారు. కాగా ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ‘మాకు ఒక్కరే దిక్కు లేదు.. 14 మందిని ఎలా చేసుకున్నావు స్వామి’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.