పొరుగు రాష్ట్రాలకు కూడా జగన్ పాలన ఎగబాకుతుంది : మంత్రి కొట్టు
అవాకులు చెవాకులు పేలితే పొరుగు రాష్ట్రాలకు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ఎగబాకుతుందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. అబ్బా కొడుకులు ఇద్దరూ వాక్చాతుర్యం తప్ప ప్రజలకు చేసింది శూన్యం అని చురకలు అంటించారు. ఏపీలో కరెంట్ లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇందులో భాగంగా కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ కు ఆంధ్రులు పెట్టిన భిక్షతోనే అభివృద్ధి చెందిందని అన్నారు. ఇరుగు పొరుగు రాష్ట్రాలు సోదరభావంతో ఉండాలని సూచించారు.
వర్షాకాలంలో నెలల తరబడి వర్షపు నీరు హైదరాబాద్ రోడ్లమీద ఉంటే కేటీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. పది వేలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు మినహా ప్రజలకు చేసింది ఏమైనా ఉందా అని విమర్శించారు. కరోనా సమయంలో తమ రాష్ట్ర ముఖ్యమంత్రి హయాంలో వైద్య సదుపాయాలు తెలంగాణలో జరిగాయా అని పేర్కొన్నారు. కరోనాను చూసి చేతులెత్తేసిన చేతగాని ప్రభుత్వం మీది కాదా అన్ని అన్నారు. కరోనా టెస్ట్ లను కనీసం చేయించాలేని దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ ప్రభుత్వానిదని అన్నారు.
పొరుగు రాష్ట్రాలపై విమర్శలు తగవని, మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే హుందాగా ఉంటుందని హెచ్చరించారు. శుక్రవారం ఏపీలో కరెంట్ లేదన్న వ్యాఖ్యలకు వైసీపీ నేతలు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలో సైతం కేటీఆర్ వ్యాఖ్యలకు ఆ పార్టీ శ్రేణులు కౌంటర్ ఇస్తున్నారు. వరదలప్పుడు హైదరాబాద్ లో పారిన నీటి వీడియోలను పోస్టు చేస్తున్నారు. తాను ఏపీ మరో ఉద్దేశంతో అనలేదని, హైదరబాద్ అభివృద్ధిపైనే వ్యాఖ్యలు చేశానని కేటీఆర్ వివరణ ఇచ్చారు.