పేదల కలను నెరవేర్చిన నాయకుడు జగన్ : విజయసాయిరెడ్డి
వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం చేసిన ప్రభుత్వం అని, తమది పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చిన ప్రభుత్వం అని వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మూడేళ్లు నిండిన సందర్భంగా తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ శ్రేణుల సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.42 లక్షల కోట్లు నేరుగా జమచేశామని, రైతు భరోసా వంటి పథకాలతో రైతులకు చేరువైన ప్రభుత్వం తమదని పేర్కొన్నారు.
మహిళా సాధికారత అనేది చేసి చూపించామని, 50 శాతం పదవులను మహిళలకే ఇచ్చామని తెలిపారు. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం పేర్కొన్నారు. విద్యారంగంలో నాడు-నేడు కింద స్కూళ్లను అభివృద్ధి చేశామని తెలిపారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన నాయకుడు సీఎం జగన్ అని స్పష్టం చేశారు. 95 శాతం హామీలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో చెప్పుకోవటానికి ఒక్క పథకం కూడా లేదన్నారు.
14 ఏళ్లుగా చంద్రబాబు సాధించలేని ప్రగతిని మూడేళ్లలోనే సాధించామని తెలిపారు. చంద్రబాబు అసభ్యకర పదజాలంతో మాట్లాడుతున్నాడని, చంద్రబాబు కార్యకర్తలతో అసభ్యంగా మాట్లాడించి సంతోష పడుతున్నాడని ఆరోపించారు. చంద్రబాబు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా వ్యవహరించట్లేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రవర్తన అత్యంత దుర్మార్గంగా ఉందని మండిపడ్డారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని, టీడీపీ తలకిందులుగా వేలాడినా అధికారంలోకి రాదని అన్నారు. మరో 30 ఏళ్లు వైసీపీనే అధికారంలో ఉంటుందని స్పష్టం చేశారు.