వామ్మో.. బరువు తగ్గాలంటే ఇలా కూడా చెయ్యొచ్చా?
మామూలుగా బరువు తగ్గాలంటే తినే ఆహార పదార్థాలను తగ్గిస్తారని తెలుసు. ఎందుకంటే తినడం ఎంత తగ్గిస్తే అంత బరువు కోల్పోతారు. కానీ ఇక్కడ బరువు తగ్గడానికి మరో మార్గం కూడా ఉంది. అదేంటంటే దంతాల వల్ల కూడా బరువు తగ్గొచ్చట. వినడానికే విచిత్రంగా ఉంది కదా.. మరి అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
న్యూజిలాండ్ లో ఒటాగో యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం చేశారు. అదేంటంటే దంతాలకు ఓ తాళం సెట్ చేస్తారు. అది చూడటానికి సైంటిఫిక్ యంత్రంలా కనిపిస్తుంది. దానిని డెంటల్ స్లిమ్ కంట్రోల్ అని అంటారు. ఇక ఈ యంత్రాన్ని పై దవడలోని ఓ దంతం, కింది దవడలోని మరో దంతానికి సెట్ చేస్తారు.
అలా చేయడం వల్ల ఆహార పదార్థాలు తినడానికి రాదు. కేవలం జ్యూస్, నీటిని మాత్రమే తాగడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ యంత్రాన్ని లాక్ వేశాక నోరు రెండు మిల్లీ మీటర్లు మాత్రమే తెరుచుకుంటుందని.. అందుకే దీని వల్ల కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకోవటానికి అనుకూలంగా ఉంటుందని తెలిసింది.
ఇక మాట్లాడటానికి, ఊపిరి పీల్చడానికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిసింది. ఇక ఈ యంత్రాన్ని కొంతమందిపై ప్రయోగం చేశారు పరిశోధకులు. ఆ ప్రయోగంలో ఓ వ్యక్తి సగటున ప్రతి రెండు వారాలకు 6.36 కేజీల బరువు తగ్గినట్లు తేలింది. ఇక ఈ యంత్రాన్ని సెట్ చేసుకున్న వాళ్ళకి కూడా బరువు తగ్గాలనే ఆలోచన పెరుగుతుందని పరిశోధకులు తెలుపుతున్నారు.