ఆవేదనతో ఈ లేఖ మీకు రాస్తున్నా : వర్ల రామయ్య
ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఈ రాష్ట్ర పోలీసులపై తనకు నమ్మకం లేదని పదేపదే చెప్పేవారని, అధికారంలోకి వచ్చాక పోలీసు వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకొని వైసీపీ నేతలు పేట్రేగిపోతుంటే ముఖ్యమంత్రిగా చోద్యం చూస్తూ ఊరుకోవడం బాధాకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. సీఎం జగన్ కు ఆదివారం వర్ల రామయ్య బహిరంగ లేఖ రాశారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్పుకునేందుకు పోలీసుశాఖను ఆయుధంగా ఉపయోగించడం క్షంతవ్యం కాదన్నారు. తప్పనిసరి పరిస్థితి తలెత్తినపుడు అమాయకులైన పోలీసులను బలిపశువులు చేస్తూ ప్రభుత్వం తప్పించుకోవడం శోచనీయమన్నారు. వీక్లీ ఆఫ్ లేక కిందిస్థాయి పోలీసు అధికారులు మానసిక వత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తామని ఆర్భాటంగా ప్రకటించి కేవలం రెండువారాల్లో ఆవిధానానికి స్వస్తి పలికిన మాట నిజమా, కాదా? అని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ డ్యూటీలు చేస్తున్నారని పోలీసు సిబ్బందికి ఇచ్చే సరెండర్ లీవ్, ఎడిషనల్ సరెండర్ లీవులు క్యాష్ చేసుకునే అవకాశాన్ని పోలీసు అధికారులకు ఎందుకు లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కిందిస్థాయి పోలీసు అధికారులకు టీఏ, డీఏలు సక్రమంగా ఇవ్వడం లేదన్నది వాస్తవమా, కాదా? అని ప్రశ్నించారు.
మాట వినని పోలీసు అధికారులను, కొన్ని కులాలకు చెందిన పోలీసు అధికారులను, సిబ్బందిని అప్రధాన పోస్టుల్లో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. పోలీసు శాఖలో ఒక కులానికి ప్రాధాన్యత ఇస్తూ ఇతర కులాలను అప్రధాన పోస్టుల్లో నియమించడం న్యాయమేనా అని నిలదీశారు. రాష్ట్రంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రికీ ఏర్పాటు చేయనటువంటి బందోబస్తు, రూట్ బందోబస్తులు, పరదాలతో కాపలాకు సిబ్బందిని నియమిస్తూ వారి రోజువారీ విధినిర్వహణకు అవరోధం కలిగిస్తున్నారని అన్నారు. పోలీసు వ్యవస్థకు తమ విధినిర్వహణ స్వేచ్ఛగా చేసుకునేలా అవకాశం కల్పించి ప్రజల్లో నమ్మకాన్ని ప్రోదిగొల్పాల్సిందిగా విజ్జప్తి చేశారు.